సర్కారు బడుల రూపురేఖలు మార్చి పేద పిల్లలకు ఆంగ్ల విద్యనందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ఈ మహాయజ్ఞంలో మంచిర్యాల జిల్లాను ముందుంచాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం కాసిపేట, తాండూరు, బెల్లంపల్లిలో రూ. 7 కోట్లతో నిర్మించిన మోడల్‌స్కూల్, కేజీబీవీ, జూనియర్ కళాశాలల వసతి గృహ భవనాలను ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, కలెక్టర్ భారతితో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, కేజీ టూ పీజీ ఉచిత విద్య కల సాకారం చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని, తెలంగాణ విద్యార్థి ప్రపంచంలో ఎక్కడికెళ్లినా తలెత్తుకొని బతకాలన్నదే ఆయన ఆకాంక్ష అన్నారు. కాళేశ్వర జలాలతో పచ్చబడ్డ రాష్ర్టాన్ని చూసి జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు కులాలు, మతాల పేరిట చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. అనంతరం ‘ఆసరా’ లబ్ధిదారులకు కార్డులు, మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
మంచిర్యాల, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలోని 26 వేల పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.7 వేల కోట్లతో ‘మన ఊరు- మన బడి’ మహాయజ్ఞాన్ని ప్రారంభించారని, ఈ యజ్ఞంలో మంచిర్యాల జిల్లాను ముందుంచాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపుని చ్చారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం రూ. 7 కోట్లతో నిర్మించిన కాసిపేటలోని మోడల్‌స్కూల్, బాలికల వసతి గృహం, తాండూరులోని కేజీబీవీ పాఠశాల వసతి గృహం, బెల్లంపల్లిలోని జూనియర్ కాలే జీ వసతి గృహ భవనాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఆమె మాట్లాడారు. తెలంగాణ విద్యార్థి ప్రపంచంలో ఎక్కడికెళ్లినా తలెత్తుకొని, ఇతరులతో పోటీపడి బతకాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. అందుకే దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. విద్యార్థులు బాగా చదివి వృద్ధిలోకి రావాలని, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవలన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఎంత కష్టపడ్డారో, వచ్చిన రాష్టాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. అమ్మాయిల విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. ఉన్నత విద్యలో అమ్మాయిల సంఖ్య పెరుగుతుందని, ఉస్మానియా యూనివర్సిటీలో 60 శాతం, కాకతీయ విశ్వవిద్యాలయంలో 70 శాతం మంది అమ్మాయిలే ఉండడం గర్వించాల్సిన విషయం అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మోడల్ పాఠశాలల నిర్వహణ నుంచి తప్పించుకుందన్నారు. కానీ 1.25 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనాన్ని దృష్టి లో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మీద రూ.400 కోట్ల భారం పడుతు న్నా సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో స్కూళ్లను నిర్వహిస్తున్నారన్నారు.
కేజీ టూ పీజీ ఉచిత విద్య అందించాలనే తన కలను సాకారం చేసుకునేందుకు ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారని చెప్పా రు. రాష్ట్రంలో 1000 గురుకులాలు ఏర్పాటు చేసి ఒకో విద్యార్థిపై రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. ఎనిమిదేళ్లలో 1150 జూనియర్ రెసిడెన్షియల్ కళాశాలలు, 85 డిగ్రీ కళాశాలలు(ఇందులో 53 అమ్మాయిలకే ప్రత్యేకంగా), 5 పీజీ కళాశాలలు అందుబాటులోకి తెచ్చారన్నారు. విదేశీ విద్యకు రూ.20 లక్షల ఓవర్సీస్ సాలర్షిప్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అన్నారు. సుమారు 4 వేల పైచిలుకు మంది విదేశీ విద్య చదువుతున్నారని.. రేపు వారు తిరిగివచ్చి తెలంగాణకు ఒక ప్రత్యేక వనరుగా మారుతారని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని చెప్పారు.
తెలంగాణకు సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మంత్రి స్పష్టం చేశారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని, కాళేశ్వరం జలాలలో పచ్చబడ్డ రాష్ర్టాన్ని చూసి బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చేస్తున్న కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలన్నారు.తెలంగాణ బీజేపీ నాయకులకు చేతగాక పక్కరాష్ర్టాల నుంచి మిడతల దండును దించుతున్నారని విమర్శించారు. కేసీఆర్లేకపోతే తెలంగాణ వచ్చేదా.. అసలు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యేవాడా ఆలోచించుకోవాలన్నారు.
నేడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న బండి సంజయ్ తెలంగాణ ఉద్యమంలోఎక్కడున్నారో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను మర్చిపోవద్దన్నారు. బండి సంజయ్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా జన్‌ధన్ ఖాతాల్లో రూ.15లక్షలు వేసి మాట్లాడాలని.. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి పాదయాత్ర చేయాలని చురకలు అంటించారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మాట్లాడుతున్న బీజేపీ నాయకులు రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రూ.20 లక్షల ఓవర్సిస్ స్కాలర్షిప్ స్కీమ్వంటివి ఏ రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర పేరుతో బండి సంజయ్, బీజేపీ ఎన్ని నాటకాలు ఆడినా తెలంగాణ ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ వెంకటేశ్‌నేత, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి, తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరుణ, మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ ఆడబిడ్డలకు పెద్దన్నగా సీఎం కేసీఆర్ అందిస్తున్న బతుకమ్మ చీరలో మహిళలపై ఆయనకు ఉన్న అభిమానం.. వాటి వెనుక ఉన్న నేత కార్మికుల కష్టం చూడాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ ఏడాది రూ.340 కోట్లతో కోటీ పది లక్షల చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. వృద్ధులు, ఒంటరి మహిళలకు సమాజంలోని ఇతర వర్గాలతో పాటు డయాలసిస్ పేషంట్లకు పింఛన్ ఇస్తూ సీఎం కేసీఆర్ తన గొప్ప మనసును చాటుకున్నారన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మహిళలకు బతుకమ్మ చీరలు, లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులు అందజేశారు.