మహిళా సంఘాలకు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయ మార్గాలను చూపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇప్పటికే మిల్లెట్ పరిశ్రమ, మినీ టాకీస్ ఏర్పాటు చేయించి సక్సెస్ అయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా పెరటి కోళ్ల పెంపకాన్ని కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు సిద్ధమవుతున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రూ. 2.25 కోట్లతో వెయ్యి యూనిట్లను ఏర్పాటు చేయనుండగా, ఇందుకోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ సహకారం తీసుకుంటున్నది. తొలి విడుతలో భాగంగా ఆరు పౌల్ట్రీ ఫామ్‌లు, 285 మందికి పెరటి కోళ్లు అందించాలని నిర్ణయించింది. దీంతో మహిళా సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఎక్కువ పెట్టుబడి లేకుండా మహిళా సంఘాలకు మంచి ఆదాయ మార్గాలను చూపించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. జిల్లాలో మహిళా సంఘాల ద్వారా ఇప్పటికే మిల్లెట్ పరిశ్రమ(చిరుధాన్యాల పొడుల ప్రాసెసింగ్ యూనిట్), ఆధునిక సాంకేతికతతో సినిమా టాకీస్ ఏర్పాటు చేసి మహిళా సంఘాలకు మంచి ఆదాయ మార్గాలను చూపించిన ప్రభుత్వం జిల్లాలోని గ్రామాల్లో మహిళల ఆధ్వర్యంలో కోళ్ల పెంపకాన్ని కూడా కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
అందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2.25 కోట్లతో జిల్లాలో 1,000 యూనిట్లను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈ ప్రణాళిక అమలు కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వారి సహకారంతో జిల్లాలో నాటుకోళ్ల పెంపకం చేపట్టనున్నది. తొలివిడుతలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో 6 కోళ్ల ఫారాలను ఏర్పాటు చేయడంతోపాటు, జిల్లాలో 285 మంది మహిళా సంఘం సభ్యులకు పెరటి కోళ్లను అందించనున్నది.
ఆదాయమార్గం..
మహిళా సంఘాలకు ఆదాయం సమకూర్చుతూనే ప్రజలకు పౌష్టికాహారం అందించాలనే సంకల్పంతో పెరటి కోళ్ల పెంపకం చేపట్టబోతున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వెయ్యి పెరటి కోళ్ల యూనిట్లను మహిళా సంఘాల ద్వా రా ఏర్పాటు చేయనుండగా, అందుకోసం రుణాలను వ్యక్తిగతంగా అందించనున్నది. స్వయం సహాయక సంఘాల్లో కోళ్ల పెంపకానికి ఆసక్తి చూపే మహిళలకు ఒక్కో యూనిట్‌కు రూ.22, 500 అందిస్తారు. ఇలా వెయ్యి మందికి రుణా లు అందిస్తారు.
ఒక్కో యూనిట్లో 100 కోడి పిల్లలు ఉంటాయి. ఇవే కాకుండా కోడి పిల్లల ఉత్పత్తి (మదర్ యూనిట్స్) చేయాలనుకునే మహిళలకు ప్రత్యేకంగా రూ.3 లక్షల వరకు రు ణం అందిస్తారు. ఈ యూనిట్లను ఏర్పాటు చే యాలని ఆసక్తి చూపించే స్వయం సహాయక సం ఘాలకు కావాల్సిన శిక్షణ, సహాయ సహకారా లు అందిస్తారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వారి వాసన్ సంస్థ ద్వారా కోళ్ల పెంపకానికి కావాల్సిన సహాయ సహకారాలను అందించనుంది.
నాటుకోడి.. పెరిగిన ఆదరణ..
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు తమ ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. మాంసాహారాన్ని తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో కోడి మాంసం ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇక నాటుకోళ్లకు ఎలాంటి డిమాండ్ ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే గ్రామాల్లో నాటు కోళ్లు కనిపించడం లేదు. ఉన్నా వాటికి చాలా డిమాండ్ ఉంటున్నది. దీంతో నాటుకోళ్ల పెంపకం ద్వారా మహిళా సంఘాలకు ఆదాయ మార్గం చూపుతూనే ప్రజలకు మంచి ఆహారం అందించవచ్చని భావిస్తున్నది.