ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా మొదటి రోజు శుక్రవారం చేపట్టిన ర్యాలీల్లో లక్షలాదిగా పాల్గొని, నినాదాలతో హోరెత్తించారు. నిర్మల్, ఖానాపూర్, ముథోల్, ఆదిలాబాద్,బోథ్ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకొని ర్యాలీల్లో కలిసి నడిచారు. ఆయా చోట్ల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు జోగు రామన్న, విఠల్‌రెడ్డి, రేఖానాయక్, రాథోడ్ బాపురావ్ పాల్గొని, నృత్యాలు చేస్తూ ఉత్సాహం నింపారు. త్రివర్ణ బెలూన్లను గాలిలోకి వదిలి, జాతీయ గీతాలాపన చేశారు. కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీలు ఉదయ్‌కుమార్ రెడ్డి, ప్రవీణ్‌కుమార్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పాల్గొన్న వారందరికీ భోజన ఏర్పాట్లు చేశారు.
-ఆదిలాబాద్ ప్రతినిధి/ నిర్మల్(నమస్తే తెలంగాణ), సెప్టెంబర్ 16
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మూడు రోజుల వేడుకల్లో భాగంగా మొదటిరోజు శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీయువకులు, మహిళలు ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ సమైక్యతా నినాదాలతో హోరెత్తించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నిర్మల్‌లో శివాజీ చౌక్ వద్ద ప్రారంభమైన ర్యాలీ ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు సాగింది.
మంత్రి, కలెక్టర్ నృత్యం చేస్తూ ఉత్సాహపర్చారు. బ్యాండు మేళంతోపాటు గుస్సాడీ కళాకారుల నృత్యాలు ఈ ర్యాలీలో ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలో మహిళా ఉద్యోగులు, విద్యార్థులతో కలిసి బతుకమ్మ పాటలపై మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు స్టెప్పులు వేశారు. అంతకు ముందు జాతీయపతాకం రంగులో తయారు చేసిన బెలూన్లను గాలిలోకి వదిలారు. వేలాది మందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. మథోల్లో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఖానాపూర్‌లో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే రేఖానాయక్, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బోథ్‌లో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ర్యాలీలో పాల్గొన్న వారికి అధికారులు భోజనం, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.