
ఇతర పంటలతో ప్రయోజనాలు
ఉమ్మడి జిల్లాలో 5,10,673 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారు. వీటిలో 4,08,112 ఎకరాల నల్లరేగడి నేలలు, 76,302 ఎకరాల ఎర్రనేలలు, 26,259 ఎకరాల ఇసుక, రాతి నేలలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న నేలల్లో యాసంగిలో వరికి బదులు వివిధ పంటలు వేయవచ్చు. నీటి వసతి ఉన్న నల్లరేగడి భూముల్లో శనగ, గోధుమ, పొద్దు తిరుగుడు, ఆముదం, పెసర, మినుము పంటలు, నీటి వసతి లేని వాటిల్లో శనగ, కుసుమ, ఆవాలు, ఎర్రటి భూముల్లో పల్లి, జొన్నలు, ఉలువలు, ఆముదం, పొద్దు తిరుగుడు, పప్పు ధాన్యాలు, ఆరుతడి పంటలు వేసుకునే అవకాశం ఉంది. రైతులు పంట మార్పిడి చేయకపోవడంతో జిల్లాలో భాస్వరం నిల్వలు బాగా పెరిగిపోయాయని అధికారులు అంటున్నారు. జిల్లాలో సాగు చేసే పంటలకు రసాయన ఎరువుల వాడకం సైతం పెరిగినట్లు ఇటీవల నిర్వహించిన సర్వేలో తెలిసింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఎకరానికి 177 కిలోల ఎరువులను వినియోగిస్తుండగా, ఆదిలాబాద్ జిల్లాలో 207 కిలోలు ఇంతకంటే ఎక్కువగా వాడుతున్నారు. యాసంగి పంటల్లో తెగుళ్ల నివారణలో కోసం పురుగు మందుల వాడకం సైతం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పంటలకు ఎరువుల వాడకం పెరిగితే.. క్రమంగా సాగుకు ఏ మాత్రం ఉపయోగపడవని నిపుణులు సూచిస్తున్నారు.
ఆవాలు : నల్లరేగడి భూముల్లో ఆవాలు సాగు చేసుకోవచ్చు. నవంబరు నెలలో పంట వేసుకోవచ్చు. విత్తిన 125 రోజుల్లో దిగుబడి వస్తుంది. ఎకరాకు 6 నుంచి 8 క్వింటాళ్లు వస్తుంది. మద్దతు ధర రూ.6550 ఉంది.
పెసర, మినుము : ఉమ్మడి జిల్లాలోని అన్ని రకాల భూముల్లో ఈ రెండు పంటలు వేసుకోవ చ్చు. స్వల్పకాలిక పంటలుగా సాగు చేయవచ్చు. కేవలం 70 రోజుల్లో ఈ పంటలు చేతికి వస్తాయి. ఎకరాకు రూ.9 వేల వరకు పెట్టుబడి అవుతుంది. ఈ రెండు పంటలు కూడా ఎకరాకు 6 క్వింటాళ్ల చొప్పున దిగుబడి ఉంటుంది. మద్దతు ధర పెసర్లు క్వింటాల్‌కు రూ. 7275 ఉండగా, మినుములకు రూ. 6300 ఉంది.
పొద్దు తిరుగుడు : యాసంగి సీజన్ ఈ పంట సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. గతంలో జిల్లాలో ఈ పంటను బాగా వేసేవారు. వరి కారణంగా పంట సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గిపోయింది. ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి అవుతుంది.90 రోజుల్లో దిగుబడి వస్తుంది. ఎకరాకు 7 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 6015ఉంది.
కుసుమ : జిల్లాలోని నల్లరేగడి భూముల్లో యాసంగి పంటగా కుసుమను సాగుచేసుకోవచ్చు. ఎకరాకు రూ.9 వేల పెట్టుబడి అవుతుండగా 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. పంట దిగుబడి ఎకరాకు 8 క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశాలు ఉండగా మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3200 ఉంది. పంట సాగులో ఇబ్బందులు తక్కువగా ఉంటాయి.
పల్లి
ఎర్ర నేలల్లో ఈ పంటను వేసుకుంటే ఎక్కువ లాభాలు పొందవచ్చు. పంటవేసిన 100 రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరాకు పెట్టుబడి రూ. 10 వేల వరకు అవుతుంది. దిగుబడి 14 క్వింటాళ్ల వరకు ఉంటుంది. మద్దతు ధర క్వింటాలుకు రూ. 5550 ఉంది. ఈ పంటతో మంచి లాభాలు పొందుతారు.
ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి
ముథోల్, నవంబర్, 9 : రైతులు తెలంగాణ ప్రభుత్వం సూచించి న మేరకు వరికి ప్రత్యామ్నా యంగా ఆరుతడి పంటలు వేసుకున్నట్లయితే మంచి దిగుబడి పొందవచ్చు. ముఖ్యంగా యాసంగిలో వేరుశనగ, శనగ, పప్పు దినుసు లు తదితర పంటలను వేసుకొని గిట్టుబాటు ధర పొందా లి. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేసినట్లయితే మంచి ఆదాయం వస్తుంది. శనగ విత్తనాలు ఆదిలాబాద్, నువ్వుల విత్తనాలు జగిత్యాలలో దొరుకుతా యి. ఆరుతడి పంటల సాగుపై రైతుల్లో అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం. వారికి పలు సూచనలు, సలహాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
పప్పు ధాన్యాల సాగుతో మంచి లాభాలు
యాసంగిలో రైతులు పప్పు ధాన్యాలు సాగు చేస్తే మంచి లాభాలు పొందవచ్చు. ఉమ్మడి జిల్లాలోని భూములు అన్ని రకాల పంటల సాగుకు అనుకూలంగా ఉన్నాయి. శనగ, కుసుమ, ఆవాలు, పొద్దు తిరుగుడు, పెసర, మినుము పంటలు వేసుకు నేందుకు జిల్లాలోని భూములు అనుకూలంగా ఉన్నాయి. పంటల సాగులో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులకు లాభాలు వస్తాయి. భూమిలో వరుసగా ఒకే పంటను వేయకుండా పంటమార్పిడి అవసరం. – శ్రీధర్ చౌహాన్, వ్యవసాయ
శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన కేంద్రం, ఆదిలాబాద్
ఆరుతడి పంటలే మేలు
బెల్లంపల్లి రూరల్, నవంబర్ 9 : యాసంగిలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటే మంచి లాభా లుంటాయి. వరి తర్వాత.. మళ్లీ వరి వేస్తే రసాయానిక ఎరువుల వినియోగం పెరుగుతుంది. చీడపీడల బెడద అధికమవుతుంది. దీనివల్ల భూసారం కోల్పోయే ప్రమాదముంది. ప్రతిసారి వడ్లు పండించడం వల్ల డిమాండ్ కూడా ఉండదు. యాసంగిలో పెసర, మినుములు, నువ్వులు, మొక్కజొన్న, వేరుశనగ, పొద్దు తిరుగుడులాంటి ఆరుతడి పంటలు వేయడం వల్ల నేలలు చౌడు బారకుండా సారవంతంగా ఉంటాయి. ఈ తరహా పంటలు వేయడం వల్ల వ్యవసాయ పరిశ్రమలు వచ్చే అవకాశముంటుంది. మేలురకమైన నూనెలను స్వయంగా తయారు చేసుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఆరుతడి పంటల్లో దిగుబడి తక్కువగా ఉన్నా.. మంచి మద్దతు ధర లభిస్తుంది.