ఉట్నూర్, సెప్టెంబర్12 : ఉద్యోగాలు సాధించే వరకు కష్టపడి చదవాలని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి సూచించారు. పీవో క్యాంప్ కార్యాలయంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకులు సాధించిన ఉట్నూర్‌కు చెందిన గిరిజన విద్యార్థులను సోమవారం పీవో అభినందించారు. ము న్ముందు లక్ష్యాలు అధిగమించాలని సూచించారు. ఉట్నూర్ నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఏకంగా 23 మంది ర్యాంకులు సాధించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఇంజినీరింగ్ ఈఈ రాథోడ్ భీంరావ్, ఐఈసీ ఉట్నూర్ డైరెక్టర్ బానోత్ రాజ్‌కుమార్, విద్యార్థులు తదితరులున్నారు.
గిరిజన దర్బార్‌కు వచ్చిన అర్జీలను వెనువెంటనే పరిష్కరించేలా అధికారులు చొరవ తీసుకోవాలని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేశారు. నార్నూర్ మండలం ముక్తాపూర్ గ్రామానికి చెందిన భరత్ స్వయం ఉపాధికి రుణం కావాలని, బజార్హత్నూర్ మండలం లక్ష్మణ్‌నాయక్ తండాకు చెందిన శ్రీరాం గ్రామానికి రహదారి మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు.
ఇంద్రవెల్లి మండలం ధరోర(బీ) గ్రామానికి చెందిన ఆత్రం ప్రభాకర్ రేషన్ డీలర్ ఇప్పించాలని, ఉట్నూర్ మండలం హస్నాపూర్ గ్రామానికి చెందిన అనీల్ కుమార్ స్వయం ఉపాధికి ఆర్థికసాయం చేయాలని దరఖాస్తు అందజేశారు. ఉపాధి, ఆసరా పింఛన్లు, రెండు పడక గదుల ఇండ్ల మంజూరు, వ్యవసాయం, రెవెన్యూకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని 44 మంది గిరిజనులు తమ అర్జీలను పీవోకు అందించారు. వీటిని ఆయా శాఖల అధికారులకు బదిలీచేశారు. కేసుల పరిష్కారానికి చొరవ చూపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో కనక భీంరావ్, డీడీ దిలీప్, ఏఎస్డీ కృష్ణయ్య, పీవీటీజీ ఆత్రం భాస్కర్, జేడీఏం నాగభూషణం, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, ఏవో రాంబాబు, డీపీవో ప్రవీణ్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.
ఆశ్రమాల్లో విద్యార్థులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు ఏఎన్ఎంలను నియమించాలని ఆదివాసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సిడాం జంగ్దేశ్ కోరారు. పీవో క్యాంప్ కార్యాలయంలో సోమవారం వరుణ్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆశ్రమాల్లో క్లోరినేషన్ చేసిన తాగునీరు, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని తెలిపారు. ప్రతి ఆశ్రమం, గురుకులాల్లో హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేయాలని, మౌలిక వసతుల ఏర్పాటు, తరగతి గదులు, డార్మెటరీ వేర్వేరుగా ఉండాలని పేర్కొన్నారు. విష జ్వరాలతో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుమూర్తి, మహేశ్వర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.