బాసర/ నిర్మల్ అర్బన్/బోథ్/నేరడిగొండ/ భైంసా/కడెం, సెప్టెంబర్ 12 : మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇక్కడి వానలు సైతం తోడవడంతో వరద పోటెత్తుతున్నది. బాసర వద్ద గోదావరి ఉప్పొంగుతున్నది. సోమవారం బాసర గోదావరి నిండుకుండను తలపించింది. స్నానపు ఘా ట్, నిత్య హారతి ఘాట్లు నీట మునిగాయి. నిత్య హారతి ఘాట్ వద్ధ శివలింగాలను నదీమాతల్లి ము ద్దాడుతున్నట్లు కనిపించింది. దీంతో వేదభారతి పీఠం విద్యార్థులు శాంతిపూజలు చేశారు. గోదావరిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో భ క్తులు నదిలో స్నానానికి వెళ్లవద్దని, మత్స్యకారు లు చేపల వేటకు పోవద్దని అధికారులు సూచిస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రజలు అప్రమత్తం గా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
నిర్మల్ జిల్లాలో సోమవారం 86.7 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా లక్ష్మణచాంద మండలంలో 146.4 మి.మీటర్లు, అత్యల్పంగా తానూర్‌లో 35.2 వర్షపాతం నమోదైంది. కుభీర్‌లో 120.8 మి.మీ, బాసరలో 72.3, ముథోల్‌లో 102.2, భైంసాలో 67, కుంటాలలో 62.4, నర్సాపూర్‌లో 55, లోకేశ్వరంలో 50.2, దిలావర్పూర్లో 89.3, సారంగాపూర్‌లో 124.2, నిర్మల్‌లో 96.8, నిర్మల్ రూరల్‌లో 76.2, సోన్‌లో 50.3, మామడలో 124.4, పెంబిలో 103.8, ఖానాపూర్‌లో 128.6, కడెంలో 78.6, దస్తురాబాద్‌లో 63 మి.మీటర్ల వర్షం కురిసింది.
భైంసా పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు రెండు గేట్లను అధికారులు ఎత్తారు. మహారాష్ట్ర నుంచి ప్రాజెక్టులోకి 20 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కిందకు వస్తున్నది. దీంతో అంతేమొత్తంలో నీటిని బయటకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 694.200 అడుగులు (6.175టీఎంసీల)గా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 61,092 క్యూసెక్కుల వరద రావడంతో అధికారులు ఆరు క్రస్ట్ గేట్లను ఎత్తి 62,365 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కుడి కాలువ ద్వారా ఐదు క్యూసెక్కులు, ప్రధాన కాలువ ద్వారా 325 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. బోథ్ మండలంలోని పొచ్చెర, నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతాలు ఉప్పొంగుతున్నాయి. వాటి అందాలను చూడడానికి చుట్ట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. జలపాతాల దృశ్యాలను సెల్ఫోన్లు, కెమెరాల్లో బంధించారు. సెల్ఫీలు తీసుకున్నారు. నార్నూర్ మండలం ఝరి గ్రామంలో ఉన్న మైసమాల్ జలపాతం మైమరపిస్తున్నది.