నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 12 : ఈనెల 16 నుంచి 18 వరకు జాతీయ సమైక్యతా వజ్రో త్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నిర్వహణపై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమై మాట్లాడారు. ఈనెల 16న అన్ని నియోజకవర్గాల్లో జాతీయ సమైక్యతా ర్యాలీలను పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో, ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించే ర్యాలీలో 15వేల మంది పాల్గొనేలా చూడాలన్నారు. పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, ప్రజలు వజ్రోత్సవాల్లో పాల్గొనాలని కోరారు.
రూట్‌మ్యాప్ తయారు చేయాలని అధికారులకు సూచించారు. ర్యాలీకి వచ్చే ప్రజల కోసం మైదానం, బస్సులు, భోజన ఏర్పాట్లు చేయాలన్నారు. 17న అన్ని ప్రాంతాల్లో జాతీయ జెండాలను ఎగురవేయాలన్నారు. అదేరోజు రాత్రి హైదరా బాద్‌లో నిర్వహించే సమావేశానికి ప్రజలను తరలిసున్నామని, ఇందుకోసం 62 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. 18న మరిన్ని ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, ఎస్పీ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
ఎదులాపురం, సెప్టెంబర్ 12 : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలోఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు జిల్లాలో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 16న ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ కేంద్రాల్లో 15వేల మంది చొప్పున జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించడం, అన్ని గ్రామాల నుంచి ప్రజలను తరలించే విధంగా ఏర్పాట్లు చేయాలని మండల అధికారులను ఆదేశించారు. 17న హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమానికి జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, మహిళా సంఘాలు, ప్రజలు వెళ్లేందుకు అవసరమైన బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు భోజన సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
18న జిల్లా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమాల నిర్వహణకు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ మండలాల వారీగా తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్షించారు. మంగళవారం అన్ని మండల కేంద్రాల్లో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని గ్రామాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వారి వివరాలు తెలుసుకొని నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశం లో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, నటరాజ్, ట్రైనీ సహాయ కలెక్టర్ శ్రీజ, అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావు, ఆర్డీవో రాథోడ్ రమేశ్, డీఎస్పీ ఉమేందర్, జడ్పీ సీఈవో గణపతి, డీఆర్డీఏ కిషన్, డీపీవో గణపతి, మున్సిపల్ కమిషనర్ శైలజ పాల్గొన్నారు.
వసతి గృహాల్లో చోటు చేసుకుంటున్న సంఘటనల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో వసతి గృహ సంక్షేమ అధికారులు, కేజీబీవీ ప్రత్యేక అధికారులకు విద్యార్థుల ఆరోగ్యంపై తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని వసతి గృహాల్లో చోటు చేసుకుంటున్న ఘటనలు జిల్లాలో పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్డెన్లు, కేజీబీవీల ఎస్వోలు నిరంతరం విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షిస్తూ ,వైద్యాధికారుల సూచనలు పాటించాలన్నారు.
వసతి గృహాల పరిసరాలు శుభ్రంగా ఉంచడంతో పాటు నీటి వసతుల వద్ద శుభ్రత పాటించేలా చూడాలని, నాణ్యమైన ,తాజా ఆహారం విద్యార్థులకు అందించాలన్నారు. విద్యార్థులకు వ్యక్తిగత ఆరోగ్యం , పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వెంటనే సమీప వైద్యాధికారులను సంప్రదించాలన్నారు. అనంతరం ప్రాజెక్టర్ ద్వారా ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శిక్షణ అదనపు కలెక్టర్ శ్రీజ, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, డీఐవో వైసీ శ్రీనివాస్, డీఎంవో శ్రీధర్, వివిధ ప్రోగ్రాం ఆఫీసర్లు పవన్‌కుమార్, క్రాంతికుమార్, తదితరులు పాల్గొన్నారు.