కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం హరితహారం ద్వారా అడవల విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తున్నది. ఈ మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది. డ్రోన్ సాయంతో పలుచగా ఉన్న అటవీప్రాంతంలో విత్తన బంతులను వెదజల్లుతున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఏడాది హరితహారంలో 55 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 35 లక్షల దాకా నాటారు. ఇందులో అటవీశాఖ ఆధ్వర్యంలో 10 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇప్పటికే 8 లక్షల వర కు మొక్కలు నాటారు. మిగతా 2 లక్షలు నాటేందుకు వేగంగా చర్యలు చేపడుతున్నారు. అడవులకు వెళ్లేదారుల్లో, మైదాన ప్రాంతాల్లో మొక్కలను నాటుతున్నారు. ఆసిఫాబాద్ అడవులు అనేక రకాల వృక్షజాతులు, జంతుజాలాలకు నిలయంగా ఉంది.
ఎత్తైన కొండలు, లోయలు, జలపాతాలు, దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోనికి వెళ్లి మొక్కలు నాటడం అంతసులువైన పనికాదు. దీంతో ప్రత్యేకంగా డ్రోన్‌ను వినియోగిస్తున్నారు. దీని సాయంతో పదివేల విత్తన బంతులను వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సుమారు వంద అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారికి 10 కిలోల విత్తనాలు వెదజల్లవచ్చు. అడవుల్లో జంతుజాలాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా డ్రోన్ సహాయంతో విత్తన బంతులను వేస్తున్నారు. సహజమైన పద్ధతుల్లో, అనువైన వాతారణంలో మొక్కలు పెరుగుతాయి. ఈ విధానంతో అడవులకుగాని, అడవి జంతువులకు గాని ఎలాంటి ఆటంకం ఉండకుండా హరిత హారం లక్ష్యాన్ని పూర్తిచేస్తున్నారు. కుమ్రం భీం ప్రాజెక్టుకు ఆనుకొని ఉన్న అడవుల్లో డ్రోన్ సాయంతో విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ చాహత్భాజ్పాయి ఈ నెల 27న ప్రారంభించారు.