ప్రభుత్వ దవాఖానల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు గౌరవం దక్కింది. నయా పాలసీలో భాగంగా వారికి 50 శాతం వేతనాలు పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం రూ.10,700 ఉన్న జీతాన్ని రూ. 15,600కు పెంచగా, నేరుగా ఖాతాల్లో జమ చేయనున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలాది మందికి ప్రయోజనం చేకూరనున్నది. తమ ఇబ్బందులను గుర్తించి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
మంచిర్యాల, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) /ఎదులాపురం/నిర్మల్ చైన్‌గేట్ : ప్రభుత్వ దవాఖానాల్లో పారిశుధ్యాన్ని మరింతగా మెరుగుపర్చాలనే ఉద్దేశంతో పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నయా పాలసీలో భాగంగా ఒక్కో బెడ్‌కు 50 శాతం నిర్వహణ చార్జీలు పెంచగా, ఈ లెక్కన వారికి రూ.15,600 వేతనం అందనున్నది.
ప్రభుత్వ నిర్ణయంతో దవాఖానల్లో పనిచేసే పారిశుధ్య కార్మికుల వేతనాలు 50 శాతం పెరుగనున్నాయి. గతంలో వారి వేతనం రూ. 10,700 కాగా, పీఎఫ్, ఈఎస్ఐ, ఇతరత్రా పోను రూ. 7,500 చేతికి వచ్చేవి. ప్రస్తుతం నిర్వహణ చార్జీలు పెంచడంతో దానికి తగ్గట్టుగా వేతనాలు పెరిగాయి. 50శాతం పెరుగుదలతో ప్రస్తుతం రూ.15,600 అయ్యింది. ఇందులో ఈఎస్ఐ, పీఎఫ్‌కు రూ.3,507 పోను, రూ. 12,093 అందనున్నాయి. అయితే ఏజెన్సీ వారు వేతనాలు తక్కువగా ఇస్తున్నారనే ఫిర్యాదుల మేరకు నేరుగా కార్మికుల ఖాతాలో జమయ్యేలా చర్యలు తీసుకుంటుంది. దీంతో ఎలాంటి అవకతవకలకు తావుండదు.
జిల్లా దవాఖానతో పాటు మంచిర్యాల క్లస్టర్ పరిధిలోని 148 మంది పారిశుధ్య కార్మికులకు ప్రయోజనం చేకూరనున్నది. అలాగే లక్షెట్టిపేట సీహెచ్‌సీ పరిధిలో 15 మందికి, చెన్నూర్ సీహెచ్‌సీలో 14 మంది, బెల్లంపల్లి సీహెచ్‌సీలో పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న 15 మందికి 50 శాతం వేతనాలు పెరిగాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో 398 మంది, నిర్మల్ జిల్లాలో 180 మంది, కుమ్రం ఆసిఫాబాద్ జిల్లాలో 34 మంది పారిశుధ్య కార్మికులకు ప్రయోజనం చేకూరనున్నది.
ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకు 50 శాతం జీతాలు పెంచినందుకు సంతోషంగా ఉంది. గతంలో సఫాయి కార్మికులు అంటే చాలా చిన్న చూపు ఉండేది. ముఖ్యమంత్రి కేసీఆర్ దయ వల్ల సమాజంలో గౌరవం పెరిగింది.
– స్వరూప, పారిశుధ్య కార్మికురాలు,
నేను 21 ఏండ్ల సంది పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్నా. గత ప్రభుత్వాలు మమ్ముల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. అరకొర జీతాలతో పని చేసినం. నెలాఖరు వస్తే అప్పులు చేయాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ సార్ ఇప్పటికే మా జీతాలను పెంచారు. ఇప్పుడు మళ్లీ 50 శాతం పెంచారు.
– అట్కపురం రాజమల్లు, పారిశుధ్య కార్మికుడు, మంచిర్యాల ప్రభుత్వ దవాఖాన
ప్రభుత్వం మా కష్టాలను గుర్తించి జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు అన్ని విధాలా అండగా ఉంటున్నారు. మమ్ముల్ని ఇంతలా ఆదరిస్తున్న ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– ఎస్.లక్ష్మి, పారిశుధ్య కార్మికురాలు, మంచిర్యాల ప్రభుత్వ దవాఖాన
మంచిర్యాల ఏసీసీ, ఆగస్టు 26 : నేను 23 ఏండ్ల సంది మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న. రూ. 800 జీతం ఉండేది. గతంలో పారిశుధ్య కార్మికులు అంటేనే చిన్న చూపు ఉండేది. తెలంగాణ వచ్చి కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు గౌరవం పెరిగింది. మా బాధలను గుర్తించి ఇప్పటికే జీతాలు మంచిగ పెంచిన్రు. ఇప్పుడు మళ్లా 50 శాతం వేతనం పెంచినందుకు సంతోషంగా ఉంది. ఇందుకు సర్కారుకు రుణపడి ఉంటాం.
– కరకాల శ్రీలత, పారిశుధ్య కార్మికురాలు, మంచిర్యాల