నిర్మల్ అర్బన్, ఆగస్టు 16 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సామూహిక గీతాలాపనకు అనూహ్య స్పందన లభించింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, నాయకులు ఉత్సాహంగా పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. నిర్మల్‌లోని మినీ ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపనలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన వజ్రోత్సవాల్లో విద్యార్థులతో కలిసి మంత్రి శాంతికపోతాలు, త్రివర్ణ బెలూన్లను ఎగురవేశారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియం నుంచి మినీట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈనెల 8నుంచి 22 వరకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వస్తున్నదన్నారు. చారిత్రాత్మక సామూహిక జాతీయ గీతాలాపన లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. నిర్మల్ జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రాంబాబు, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
మహనీయుల త్యాగ ఫలమే స్వాతంత్య్రం
ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితంగానేదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని ముథోల్ ఎమ్మెల్యే జీ విఠల్‌రెడ్డి అన్నారు. వజ్రోత్సవాలను పురస్కరించుకొని కుభీర్‌లోని వివేకానంద కూడలిలో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి ఒక్కరిలో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిల్చేలా సీఎం కేసీఆర్ వజ్రోత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. దేశ భవిష్యత్ యువతపైనే ఆధార పడి ఉందని, ప్రతి ఒక్కరూ చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. గీతాలాపనకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, మహిళా సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, రైతులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆరోగ్య సిబ్బంది జాతీయ జెండాలతో హాజరయ్యారు. ఉదయం 11.30 గంటలకు జాతీయ జెండాకు వందనం చేసి సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. భరతమాత, దేశ నాయకుల నినాదాలతో కుభీర్ హోరెత్తింది. అనంతరం ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కపోతాలను ఎగురవేశారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసిన ఎస్సై ఎండీ షరీఫ్‌తో పాటు పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సర్పంచ్ పానాజీ మీరా విజయ్ కుమార్, జడ్పీటీసీ అల్కాతాయి సంజయ్ చౌహాన్, వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, తహసీల్దార్ విశ్వంభర్, ఎంపీడీవో రమేశ్, ఎంఈవో చంద్రకాంత్, సీఐ చంద్రశేఖర్, పీఏసీఎస్ చైర్మన్ రేకుల గంగాచరణ్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, ఇక్రం, గోనె కల్యాణ్, రాజన్న, పీరాజీ పాల్గొన్నారు.
ఘనంగా జాతీయ గీతాలాపన
సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. వజ్రోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్ ఉదయం 11.30 గంటలకు నిర్వహించిన జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు, ప్రజాప్రతినిధులు ,ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడారు. పిల్లల్లో దేశభక్తి భావం పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. హాజరైన ప్రతి ఒక్కరికీ కలెక్టర్, ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని ప్రధాన కూడళ్లలో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపనను జిల్లా యంత్రాం గం, పోలీసు శాఖ సమన్వయంతో విజయవంతంగా నిర్వహించినట్లు తెలియజేశారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ వీ ఉమేందర్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, డీపీఆర్వో ఎన్ భీంకుమార్, డీవైఎస్వో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శైలజ, సీఐ పీ సురేందర్, శ్రీధర్, మల్లేశ్ పాల్గొన్నారు.