ఎదులాపురం, ఆగస్టు 6 : సంగారెడ్డి ఎస్పీ ఎం.రమణ కుమార్ చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్‌రెడ్డి స్వీకరించారు. ఈ మేరకు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో కలిసి మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను తీసుకున్నారు. అనంతరం మొక్కలతో సెల్ఫీ తీసుకుని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్, ఆసిఫాబాద్ ఎస్పీ కే. సురేశ్‌కుమార్, మంచిర్యాల అదనపు డీసీపీ అఖిల్ మహాజన్‌కు ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్ ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. చెట్లు మానవాళి మనుగడకు ఆధారమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని కోరారు. డీఎస్పీలు వీ.ఉమేందర్, ఎం.విజయ్‌కుమార్, రిజర్వ్ సీఐ డీ.వెంకటి, ఎం.శ్రీపాల్, ఎం.వంశీకృష్ణ, డీసీఆర్బీ సీఐ జే.గుణవంత్‌రావు, కార్యాలయ ఏవో యూనిస్ అలీ, సూపరింటెండెంట్ జోసెఫిన్ పాల్గొన్నారు.
ఉద్యమానికి ఊపిరి..
తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన జయశంకర్ సార్ సదా స్మరణీయులని ఎస్పీ డి.ఉదయ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం పోలీసు ముఖ్య కార్యాలయంలో ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. పోలీస్ సాయుధ కార్యాలయంలో ఏఆర్ డీఎస్పీ ఎం.విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ జయంతి నిర్వహించారు.