ఎదులాపురం, జూలై 29 : జలశక్తి అభియాన్ ద్వారా నీటి సంరక్షణకు చేపట్టిన పనులను సమర్థవంతంగా నిర్వహించాలని గ్రామీణాభివృద్ధి ఫైనాన్షియల్ అసిస్టెంట్, కేంద్ర జలశక్తి పరిశీలకుడు వేద వీర్ ఆర్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన జల శక్తి అభియాన్ కింద వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పనులను సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. 75 సంవత్సరాల అజాదీకా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా జలశక్తి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని, 44 శాతం అటవీ విస్తీర్ణం గల ఆదిలాబాద్ జిల్లాలో నీటి సంరక్షణ, వాటర్ షెడ్ల అభివృద్ధి, అడవుల పెంపకానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. హరితహారంలో భాగంగా ప్రతి ఇంటికీ మొక్కలను పంపిణీ చేయడంతో పాటు వాటిని సంరక్షించేలా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలల్లో కిచెన్ గార్డెన్, పట్టణ, బృహత్ ప్రకృతి వనాలు, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఉన్నాయన్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జలశక్తి అభియాన్ క్రింద చేపట్టిన పనుల పురోగతిని వివరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఆదిలాబాద్ రూరల్ మండలం కొత్తూరు గ్రామ చెక్ డ్యామ్, మావల పార్క్, ఇచ్చోడ మండంలోని ముక్రా (కే) గ్రామంలో జలశక్తి అభియాన్ కింద చేపట్టిన నీటి సంరక్షణ నిర్మాణాలు, ఇంకుడు గుంతలు తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు. సమావేశంలో శాస్త్రవేత్త ఎన్.కే భట్నాగర్, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, డీఆర్డీవో కిషన్, డీపీవో శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య పంచాయతీ రాజ్ ఈఈ మహావీర్, అదనపు డీఆర్డీవో రవీందర్ రాథోడ్, ఆయా మండల ఎంపీడీవోలు, అధికారులు పాల్గొన్నారు.
ముక్రా (కే) పంచాయతీకి ప్రశంసలు..
ఇచ్చోడ, జూలై 29 : ముక్రా (కే) గ్రామం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వ జల్ శక్తి అభియాన్ అండ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ బృందం కితాబు నిచ్చింది. గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను బృందం సభ్యులు పరిశీలించి పాలకవర్గాన్ని అభినందించారు. గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్ తదితరులు పాల్గొన్నారు.