నార్నూర్, జూలై 28: మండలంలో సంపూర్ణ పారిశుధ్యాన్ని పాటించాలని ఎంపీడీవో కావల రమేశ్ పంచాయతీ సిబ్బందికి సూచించారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, హరితహారం మొక్కలు నాటేందుకు చేపట్టిన కార్యాచరణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఇళ్లలో వాడుకున్న నీళ్లు రహదారులపైకి రాకుండా ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలను నిర్మించుకునేలా ప్రోత్సహించాలన్నారు. నీటి నిల్వ ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేసి దోమల నివారణ మందును పిచికారీ చేయించాలన్నారు. క్రీడాప్రాంగణాల ఏర్పాటు వేగవంతం చేయాలని, హరితహారంలో భాగంగా పంచాయతీలకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో మండల పంచాయతీ అధికారి స్వప్నశీల, ఈజీఎస్ ఏపీవో రాథోడ్ సురేందర్, కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు.
పారిశుధ్య పనుల పరిశీలన
మండలంలోని తడిహత్నూర్, నార్నూర్, బలాన్పూర్ గ్రామాల్లో పారిశుధ్య పనులను ఎంపీడీవో పరిశీలించారు. మురుగుకాలువలో చెత్త తొలిగింపు, బ్లీచింగ్, తాగునీటి బావుల్లో క్లోరినేషన్, పల్లెప్రకృతి వనంలో మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి శేఖర్, సర్పంచ్ ఆత్రం పరమేశ్వర్, రాహుల్ ఉన్నారు.
గాదిగూడ మండలంలో..
అంటువ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీవో షేక్ కలీంహైమద్ అన్నారు. గురువారం గాదిగూడ మండలం ఆదిమ్యాన్, ఖండో, రాంపూర్, డొంగర్‌గావ్ గ్రామాల్లో పారిశుధ్య పనులు పరిశీలించారు. నిత్యం పారిశుధ్య పనులు కొనసాగించాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. దాబా(కే) కల్వర్టుపై కర్రలు తొలిగింపజేశారు. ఇక్కడ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
బేలలో ..
బేల, జూలై 28 : మండల కేంద్రంలోని ప్రతి వార్డులో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. గురువారం బేల సర్పంచ్ వట్టిపెళ్లి ఇంద్రశేఖర్ ఆధ్వరంలో పిచ్చి మొక్కల తొలిగింపు, క్లోరినేషన్ చేయించారు. ఉన్నత పాఠాశాలలో నీరు నిల్వ ఉండడంతో కాలువను తీయించారు. ఇక్కడ పంచాయతీ కార్యదర్శి సురేశ్, ఉపాధ్యాయులు సోనేరావు, రాజ్‌కుమార్, గ్రామస్తులు ఉన్నారు.
ఉట్నూర్‌లో..
ఉట్నూర్ రూరల్, జూలై 28: పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీపీ పంద్రా జైవంత్‌రావ్ సూచించారు. గురువారం చింతగూడలో తెలంగాణ సాంస్కృతిక బృందం ఆధ్వర్యంలో కళాజాత నిర్వహించారు. సీజనల్ వ్యాధులు, పారిశుధ్యంపై పాటలు, ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. ఇక్కడ గోవింద్‌రావ్, మోహన్ నాయక్ ఉన్నారు.
భీంపూర్, జూలై 28: భీంపూర్, అందర్‌బంద్, కామట్‌వాడ, అంతర్గాం, అర్లి(టీ)లో గురువారం పారిశుధ్య పనులు చేపట్టారు. బోరుబావులు, రక్షిత మంచి నీటి ట్యాంకులను శుభ్రం చేయించి క్లోరినేషన్ చేశారు. పంచాయతీ సిబ్బంది ఇచ్చిన చెత్తబుట్టలను ప్రజలు వినియోగించుకోవాలని సర్పంచులు,కార్యదర్శులు సూచించారు.