ప్రయాణం చేయాలంటే భయమేస్తంది..
జాతీయ రహదారి ముందే మంచిగా లేదు. అండర్‌పాస్‌లు, టర్నింగ్‌లు సరిగా లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కురిసిన వానలతో రోడ్డ బాగా పాడయింది. ఎక్కడ చూసినా గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని భయం వేస్తుంది. వాహనంలో స్పీడ్‌గా పోకుండా మెల్లగా పోతున్నాం. రోడ్డుపై గుంతలు ఏర్పడటంతో వాహనాలు పాడవుతున్నాయి. నడుంనొప్పి లాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
– రవి, వాహనదారు.
ఆదిలాబాద్, జూలై 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హైదరాబాద్-నాగ్‌పూర్ జాతీయ రహదారి(ఎన్‌హెచ్)-44 ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 120 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలు విస్తరించి ఉంది. ఈ రోడ్డు మీదుగా రోజూ వేలాది వాహనాలు దక్షిణాది నుంచి ఉత్తరాది రాష్ర్టాలకు రాకపోకలు సాగిస్తాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజలు తమ అవసరాల కోసం హైదరాబాద్‌తోపాటు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు రోడ్డు మార్గం ద్వారా వెళ్తుంటారు. సరుకుల రవాణా చేసే వాహనాల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. ఈ రహదారి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) పరిధిలోకి వస్తుంది. రోడ్డు నిర్మాణ లోపం కారణంగా తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ రహదారిపై పలు బ్లాక్ స్పాట్లను గుర్తించినా, వాటిని సరిచేయక పోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని సమీప గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా అవసరమైన చోట సర్వీస్ రోడ్లు, స్లీప్ రోడ్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టలేదు. ప్రమాదాల నివారణ కోసం చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు గతంలో పలుమార్లు ఎన్హెచ్ఏఐ అధికారులను కోరినా ఫలితం లేదు. ఆదిలాబాద్ జిల్లాలోని జాతీయ రహదారిపై గతంలో జందాపూర్ ఎక్స్‌రోడ్, మావల క్రాసింగ్, భోరజ్ చెక్‌పోస్టు, మావల మూలమలుపు, దేవాపూర్ క్రాసింగ్, గుడిహత్నూర్ బస్టాండ్ ఏరియా, గాంధీనగర్, ఉట్నూర్ క్రాస్‌రోడ్డు, సీతాగోంది ప్రాంతాల్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. వీటిని అధికారులు బ్లాక్ స్పాట్లుగా గుర్తించినా రక్షణ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.
ఎన్హెచ్ఏఐ అధికారులు రోడ్డు బాగు చేయాలి..
ఆదిలాబాద్ జిల్లాలోని జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న ఎన్హెచ్ఏఐ అధికారులు అసలు పట్టించుకోవడం లేదు. రోడ్డు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రోడ్డు నిర్మాణంలో భాగంగా ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోలేదు. నిర్మాణ లోపాలను సరిచేయాలని పలుమార్లు కోరినా అధికారుల నుంచి స్పందన లేదు. ఎన్హెచ్ఏఐ అధికారులు రహదారిని బాగు చేయాలి. – శేబాజ్, వాహనదారు
గుంతలమయం
ఆదిలాబాద్-నిర్మల్ జిల్లాల్లో విస్తరించి ఉన్న ఎన్‌హెచ్-44 గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలతో అధ్వానంగా తయారైంది. ఈ రహదారిపై రోజూ 10 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. రోడ్డుపై పెద్ద, పెద్ద గుంతలు ఏర్పడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మెల్లగా వాహనాలను నడుపుతున్నారు. రోడ్డుపై గుంతల కారణంగా వాహనాలు పాడవుతున్నాయని, ప్రయాణం కష్టంగా ఉందని వాహనదారులు వాపోతున్నారు. రహదారి పాడయినా ఎన్హెచ్ఏఐ అధికారులు పట్టించుకోవడం లేదు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని జాతీయ రహదారి-44పై మూడు టోల్‌ప్లాజాలు కూడా ఉన్నాయి. నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్, నేరడిగొండ మండలం రోల్మామడ, జైనథ్ మండలం పిప్పర్వాడ వద్ద 2008లో ఏర్పాటు చేసి టోల్‌టాక్స్ వసూలు చేస్తున్నారు. ఈ రహదారిపై రోజూ కార్లు, బస్సులు, లారీలు, గూడ్స్ వాహనాలు, ఇతర భారీ వాహనాలు 10 వేల వరకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఒక్కో టోల్‌ప్లాజా వద్ద కార్లకు రూ.150 మొదలుకొని భారీ వాహనాలకు రూ.955 వరకు వసూలు చేస్తున్నారు. భారీగా టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్న ఎన్హెచ్ఏఐ అధికారులు రహదారి నిర్వహణను గాలికి వదిలేయడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంతలమయంగా మారిన రహదారికి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
నిర్వహణ గాలికి వదిలేశారు
నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వరకు జాతీయ రహదారి అస్తవ్యస్తంగా మారింది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఈ రహదారి నిర్వహణను ఎన్హెచ్ఏఐ అధికారులు గాలికి వదిలేశారు. ఇటీవల జైనథ్ మండలం భోరజ్ వద్ద ప్రమాదాలు వరుసగా మూడు ప్రమాదాలు జరిగి ముగ్గురు చనిపోయారు. స్థానికులు ఆందోళన చేస్తేగాని అధికారులు స్పందించలేదు. అధికారులు బ్లాక్స్పాట్లు గుర్తించినా అయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం లేదు.భారీగా టోల్ వసూలు చేస్తున్న ఎన్హెచ్ఏఐ అధికారులు రహదారి నిర్వహణ సక్రమంగా నిర్వహించాలి. – ఉషన్న, పిప్పర్వాడ, జైనథ్ మండలం