కడెం, జూలై 18: వరద బాధితులందరికీ అండగా ఉంటామని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ భరోసానిచ్చారు. సోమవారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి కడెం జలాశయాన్ని పరిశీలించారు. జలాశయ పరిస్థితిని నీటిపారుదలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరదల కారణంగా 17 వరదగేట్లను ఎత్తి దిగువకు 2.90 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని అధికారులు పేర్కొన్నారు. అదనంగా వచ్చిన మరో 2 లక్షల పైచిలుకు వరదనీరు క్రస్ట్‌గేట్ల మీది నుంచి వెళ్లిందన్నారు. భారీ ప్రవాహాన్ని తట్టుకోలేక నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై కడెం వంతెన వద్ద 450 మీటర్ల మేరకు రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిందని చెప్పారు. పెద్దూర్, కడెం, కన్నాపూర్, కొండుకూర్, పెద్దబెల్లాల్, పాండ్వాపూర్, అంబారిపేట, దేవునిగూడెం గ్రామాల్లోకి నీరు చేరి భారీగా నష్టం వాటిల్లినట్లు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. క్రస్ట్‌గేట్లను పరిశీలించిన అనంతరం కలెక్టర్ కడెం ప్రధాన కాలువ వద్ద పడిన గండిని పరిశీలించారు.
జలాశయాన్ని పరిశీలించేందుకు వచ్చిన నిపుణుల బృందం సభ్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. అక్కడి నుంచి తెగిన వంతెన వద్దకు చేరుకుని ఆర్అండ్బీ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వంతెన పునర్నిర్మాణంపై ప్రభుత్వానికి నివేదికనందించామని ఈఈ పేర్కొన్నారు. ప్రస్తుతం వాగులో నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తున్న తరుణంలో వారికి తాత్కాలిక రోడ్డు సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కాలినడక కోసం తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేస్తామని, మూడు రోజుల్లో ప్రజలు నడిచేలా రహదారి పనులు పూర్తి చేస్తామన్నారు.
గతంలో అనేకమార్లు బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపామని, అప్పుడు రూ. 18 కోట్లు అంచనా వేయగా, ఇప్పుడు రూ. 30 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని ఈఈ కలెక్టర్‌కు విన్నవించారు. అనంతరం కడెంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. కూలిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. తహసీల్ కార్యాలయంలో నిల్వ ఉంచిన నిత్యావసర సరుకులను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కడే, ఇన్చార్జి ఆర్డీవో తుకారాం, నీటిపారుదలశాఖ ఏస్ఈ సుశీల్ దేశ్‌పాండే, ఈఈ రాజశేఖర్, డీఈలు భోజదాస్, నవీన్, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, డీఈ చందు, ఏఈఈ లవకుమార్, ఆర్అండ్బీ ఈఈ అశోక్‌కుమార్, విద్యుత్ ఏస్ఈ చౌహాన్, ఏఈ సుమన్‌కుమార్, తహసీల్దార్ గజానన్, సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన
ఖానాపూర్ రూరల్, జూలై 18: పాతతర్లపాడ్లో సోమవారం నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ పారూఖీ పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి గ్రామంలోని వాగు బీభత్సం సృష్టించింది. ఈ వరద నీటితో నష్టం సంభవించిన ప్రాంతాలను అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కడేతో కలిసి సందర్శించారు. కోతకు గురైన బీటీ రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో మునిగిన ఇండ్లను పరిశీలించారు. ఇండ్లు మునిగిన వారికి పునరావాసం కల్పించాలని అధికారులకు సూచించారు. అధికారులు స్థానికంగా ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజమోహన్, ఆర్ఐ రాజేశ్వర్, నాయకులు పడిగెల శేఖర్, బొంత భూమన్న పాల్గొన్నారు.
ప్రజా ఫిర్యాదులను పరిష్కరించాలి
నిర్మల్ టౌన్, జులై 18: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహించారు. నిర్మల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. వీటిని సంబంధిత అధికారులకు పంపించి పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 10 అర్జీలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. చాలా గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టం జరిగిందని, తమను ఆదుకోవాలని బాధితులు వినతిపత్రంలో పేర్కొన్నారని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, జిల్లా అధికారులు, ఫిర్యాదుదారులు తదితరులు పాల్గొన్నారు.