కడెం, జూలై 18 : నిర్మల్ జిల్లాలో వారం రోజులపాటు ఏకధాటిగా కురిసిన వర్షాలతో కడెం ప్రాజెక్టుకు దాదాపు 5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. ప్రధాన కాలువకు గండి పడడంతోపాటు క్రస్ట్‌గేట్లకు కూడా ఇబ్బందయ్యింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంజినీరింగ్ చీఫ్ (ఈఎన్సీ) ఆపరేషన్ మెయింటనెన్స్(ఓఅండ్ఎం) మెకానికల్ సభ్యులు సోమవారం సందర్శించారు. క్రస్ట్‌గేట్లు, ప్రధాన కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు క్రస్టుగేట్ల కౌంటర్ వెయిట్ తెగిపోవడం, గేట్ల నుంచి వరద పారడం తో మిషన్ వ్యవస్థ పాడవడం, విద్యుత్ సమస్య వంటి వాటితో నీటిని దిగువకు వదులుతున్నామన్నారు. వీటితోపాటు ఇక్కడ పరిశీలించిన అంశాలతో నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు. అధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని ఆయకట్టు ఎస్ఈ సుశీల్కుమార్పాండే, ఈఈ రాజశేఖర్ తెలిపారు. పరిశీలించిన వారిలో ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ బృందం సభ్యులు ఈ ఈ విద్యానంద్, డీఈ కరుణాకర్, జేఈ సంగీత్, రిటైర్డ్ అధికారి సురేందర్‌తోపాటు, స్థానిక నీటిపారుదలశాఖ అధికారులు ఉన్నారు.