సీసీసీ నస్పూర్, జూలై 16 : మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలతో జరిగిన నష్టంపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో జరిగిన నష్టం, సహాయక చర్యలపై సీసీసీ సింగరేణి అతిథి గృహంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండే విఠల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, కలెక్టర్ భారతీ హోళికేరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. భారీ వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం చేపట్టిన సహాయక చర్యలు, ఆస్తి, పంటల నష్టం, బాధితులకు అందించిన సహాయక చర్యలపై అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేశారు. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో ముఖ్యంగా పంటలు దెబ్బతిన్నాయని, మండల వ్యవసాయ అధికారులు పంట నష్టంపై సమగ్ర సర్వేలు చేయాలని ఆదేశించారు. నస్పూర్‌కు చెందిన ఇద్దరు సింగరేణి రెస్క్యూ సిబ్బంది వరద సహాయక చర్యల్లో మరణించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇబ్బందులులేకుండా చూడాలి.. : విప్ సుమన్
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని విప్ బాల్క సుమన్ సూచించారు. ఆస్తి, పంట నష్టం కలిగిన వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసానిచ్చారు. రోడ్లు, బ్రిడ్జిలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ.. ఆయా నియోజకవర్గాల్లో వరద పరిస్థితులు, జరిగిన నష్టం, ప్రజలకు అం దించిన సేవలను వివరించారు. అందరి సహకారంతోనే జిల్లాలో ప్రాణనష్టం జరగకుండా అధికార యంత్రాంగం నిత్యం అందుబాటులో ఉండి సేవలందించిందని కలెక్టర్ భారతీ హోళికేరి తెలిపారు. జిల్లాలో 8నుంచి 14 తేదీ వర కు 49 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. వరదల కు 13 కాలనీలు ముంపుకు గురయ్యాయని వెల్లడించారు. 32 వేల ఎకరాల్లో పత్తి, రెండు వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతి న్నట్లు చెప్పారు. 22 వేల మంది రైతులు నష్టానికి గురయ్యారని, వరదలతో బోట్లు, చేపలు, దాదాపు రూ.3 కోట్ల నష్టం వాటిల్లిందని, 55 పశువులు మృతి చెందినట్లు వివరించారు. ఇక్కడ జిల్లా అటవీశాఖ అధికారి శివాని డొ గ్రె, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.