బోథ్, జూలై 13: బోథ్ మండలంలో 190.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ధన్నూర్ (బీ), పెద్దవాగు, సొనాల, చింతల్బోరి, మర్లపెల్లి, పట్నాపూర్, అందూర్, మందబొగుడ, రఘునాథ్‌పూర్, పెద్దగూడ, కోటా (కే) తదితర గ్రామాల్లోని వాగులన్నీ ఉప్పొంగి ప్రవహించాయి. వాగుల పరీవాహక ప్రాంతాలతో పాటు దాదాపుగా పంట పొలాలన్నీ జలమయమయ్యాయి. చాలా గ్రామాల్లోని కాలనీలను వరద ముంచెత్తింది. బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, బోథ్ పీఏసీఎస్ చైర్మన్ కే ప్రశాంత్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు బీ శ్రీధర్‌రెడ్డి, మహిపాల్, తదితరులు సొనాల, కన్గుట్ట, కుచ్లాపూర్, ధన్నూర్ (బీ) పరిసరాల్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బోథ్‌లోని సాయినగర్, కొత్త కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో సర్పంచ్ సురేందర్ యాదవ్ పంచాయతీ సిబ్బందితో కలిసి నీటిని బయటకు పంపేలా ఏర్పాట్లు చేయించారు. షేక్ ముసా కుటుంబ సభ్యులకు రూ.2 వేలు అందించారు. ఈవో అంజయ్య, ఆర్ఐ దశరథ్, షేక్ షాకీర్, సల్ల రవి ఉన్నారు. ధన్నూర్ (బీ) గ్రామం జలదిగ్బంధమైంది. వాగు మూడు రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అక్కడి ప్రజలు గ్రామం దాటి బయటకు రాలేక పోతున్నారు. నిత్యావసర సరకులు, వైద్యం తదితర వాటి కోసం పాట్లు పడుతున్నారు.
నేరడిగొండ, జూలై 13 : మండలంలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నాలుగు రోజులుగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వాంకిడిలో కొట్టం కూలిపోవడంతో ఎస్కే సలీంకు చెందిన బర్రె మృతి చెందింది. వాగ్దారి గ్రామాన్ని ఆనుకొని కడెం ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. పంట చేన్లు చెరువులను తలపిస్తున్నాయి.
గుడిహత్నూర్, జూలై 13: మండలంలోని మన్నూర్, సీతాగోంది, గుడిహత్నూర్ తదితర గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద చేరింది.లింగాపూర్, మన్నూర్, తోషం, బెల్లూరి, సూర్యగూడ,వైజాపూర్ గ్రామాలకు ఆనుకొని ఉన్న వాగులు ఉప్పొంగి పారడంతో ఇరువైపులా ఉన్న చేలల్లోకి వరద చేరింది. పత్తి, సోయా మొక్కలు కొట్టుకుపోయాయి. మండల కేంద్రంలోని ఓ కిరాణా షాపులోకి మోకాళ్ల లోతు వరద చేరడంతో అందులోని సరుకులన్నీ తడిసిపోయాయి. మండల కేంద్రంలో మహంకాళీ కాలనీలో ఓ ఇల్లు కూలిపోయింది. ఎంపీ సోయం బాపురావ్, సర్పంచ్ జాదవ్ సునీత, తహసీల్దార్ సంధ్యారాణి, ఎస్ఐ ఎల్ ప్రవీణ్ బాధితులను పరామర్శించి భరోసా నిచ్చారు.
సిరికొండ, జూలై 13 : సిరికొండ, ఇంద్రవెల్లి మధ్యన ఉన్న వంతెన తెగిపోవడంతో రెండు మండలాలకు రాకపోకలు నిలిచాయి. వాహదారులు, ప్రజలు ఈ రోడ్డు మార్గం ద్వారా వెళ్లకుండా సిరికొండ ఎస్ఐ నీరేశ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండాపూర్ చెరువు తెగిపోవడంతో పంటలకు నష్టం వాటిల్లింది. వాయిపేట్, తుమ్మలపాడ్, పోచంపల్లి, కన్నపల్లి, రాంపూర్, కంటగూడ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుస్తున్నాయి.
భీంపూర్, జూలై13: ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో పెన్‌గంగ ఉగ్రరూపం దాల్చింది. అంతర్గాం వద్ద జడ్పీటీసీ సుధాకర్, నాయకుడు కపిల్ పెన్‌గంగను పరిశీలించారు. అందర్‌బంద్ వద్ద బ్రిడ్జి దెబ్బతినడంతో చినబంద్ర,పెద్ద బంద్ర సహా మరో మూడు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచాయి.
సీఐ నరేశ్,ఎస్ఐ రాధిక ,సర్పంచ్ పెండెపు కృష్ణయాదవ్ కల్వర్టును పరిశీలించారు. తాత్కాలికంగా మరమ్మతు చేయించారు. కరంజి(టీ) తర్వాత, వాగులు రావడంతో గుబ్‌డి,కొజ్జన్గూడ ,టేకిడిరాంపూర్ ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి ఉన్నది. గోముత్రిలో గొల్లి దేవయ్య ఇంటి ప్రహరీ కూలిపోయింది. జలకొరిలో గిరిజన రైతు టేకాం రుకుంబాయికి చెందిన ఆవు విద్యుత్‌షాక్‌తో మృతిచెందింది. పొలాలన్నీ జలమయమయ్యాయి. జెండాగూడ ప్రాజెక్టు జలసిరితో చూపరులను ఆకట్టుకుంటున్నది.
ఇచ్చోడ, జూలై 13 : మండలంలోని జామిడి గ్రామానికి చెందిన సముదాన్, సాథ్నంబర్లో రాథోడ్ రవీందర్‌లకు చెందిన ఇండ్లు కూలిపోయాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. జామిడిలో బాధితుడికి రూ. 60 వేల నష్టం వాటిల్లినట్లు సర్పంచ్ హరన్ సుభాష్ తెలిపారు. మండలంలో భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు, వొర్రెలు పొంగి ప్రవహించాయి. ముక్రా(కే), అడెగామ (కే), అడెగామ(బీ) వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. గుండాల, బాబ్జీపేట్, ఎల్లమ్మగూడ, జోగిపేట్, జెండాగూడ, తదితర గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి.
తాంసి, జూలై 13 : తాంసి మండలంలోని తాంసి, గిరిగాం, పొన్నారి, కప్పర్ల, వడ్డాడి, హస్నాపూర్, బండలనాగాపూర్తో పాటు పలు గ్రామాల్లోని చేలల్లో వరద చేరింది. పత్తి, సోయాబీన్ పంటలకు నష్టం వాటిల్లింది. గ్రామాల్లో వర్షం వల్ల ఎలాంటి ఆస్థినష్టం ప్రాణనష్టం వాటిల్లిన సంబంధిత అధికారులకు సమచారం అందజేయాలని తహసిల్ధార్ శ్రీదేవి అన్ని గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించారు.
కొట్టుకు పోయిన వంతెనలు
బేల, జూలై 13 : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దహిగాం, దేవ్జీగూడ, మనియార్పూర్ సమీపంలో ఉన్న వంతెనలు వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచాయి. సాంగిడిలో పలు ఇళ్లు కూలిపోయాయి. పెన్‌గంగా పరీవాహక ప్రాంతమైన సాంగిడిలో వరద తీవ్రత ఎక్కువ కావడంతో అధికారులు పరిశీలించారు. చప్రాలలో వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరడంతో నిత్యావసర వస్తువులు తడిసిపోయాయి. వారికి రైతు వేదిక భవనంలో ఆశ్రయం కల్పించారు. బాధితులకు టీఆర్ఎస్ నాయకులు నిత్యావసర సరుకులు అందించారు. వారి వివరాలు సేకరించి ప్రభుత్వం ద్వారా పరిహారం అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. సర్పంచ్ దౌలత్పటేల్, ఎంపీటీసీ రాకేశ్, గ్రామస్తులు కన్నల గంగన్న, యాసం సతీశ్ ఉన్నారు.