ఉట్నూర్ రూరల్, జూలై 13: పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో తమను ఇంటికి తీసుకెళ్లమని చిన్నారులు తల్లి దండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. వారిని ఇంటికి తీసుకు వచ్చేందుకు వెళ్తుండగా డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ముగ్గురు రోడ్డు ప్రమాదంలో బలయ్యారు. ఉట్నూర్ మండలం శాంపూర్ పంచాయతీ పరిధిలోని గోదరిగూడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా, డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు సురక్షితంగా బయట పడ్డారు. ఈ ఘటనకు అతి వేగమే కారణమని తెలుస్తున్నది. వాహనం అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని ఎస్ఐ భరత్ సుమన్ తెలిపారు.
నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ఎల్లంత్వార్ సుదర్శన్, అతని భార్య నాగమణి(36), కాజా పాంగ్రి గ్రామానికి చెందిన అమృత్(46), కుంటాల మండలం అంబకంటికి చెందిన గాజ సవిత(28), బొమ్మిని గ్రామానికి చెందిన లక్ష్మి పిల్లలు ఆసిఫాబాద్‌లోని జ్యోతిబాపూలే పాఠశాలలో చదువుకుంటున్నారు. వర్షాల కు పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో పిల్లలు ఫోన్ చేసి ఇంటికి తీసుకెళ్లమని చెప్పారు. బుధవారం ఉదయం టాటాఏస్ అద్దెకు మాట్లాడుకొని ఆసిఫాబాద్‌కు బయలు దేరాదు. ఇంతలో గోదరిగూడ రాగానే డ్రైవర్ అతివేగంగా నడుపడంతో అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది. వాహనంలో డ్రైవర్ తన వెంట మరో ఇద్దరిని వెంట తీసుకచ్చుకున్నాడు. వీరి ముగ్గురికి ఎటువంటి గాయాలు కాలేదు. వాహనంలో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. బొమ్మిని లక్ష్మికి తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. పిల్లలను తీసుకు రావడాని వెళ్లి వారికి దూరమయ్యారంటూ బంధువులు రోదించిన తీరు స్థానికులను కలిచి వేసింది. బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
కుంటాల, జూలై 13: కుంటాల మండలం అంబకంటికి చెందిన గాజ సవిత (28) కుమారులు అభిలాష్, అభిషేక్ బెల్లంపల్లి, ఆసిఫాబాద్ గురుకుల పాఠశాలల్లో చదువు కుంటున్నారు. పిల్లలను తీసుకువచ్చేందుకు వెళ్తుండగా సవిత మృతి చెందిందన్న సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. భర్త మురళితో పాటు గ్రామస్తులు మృతదేహాన్ని తీసుకరావడానికి ఉట్నూర్‌కు వెళ్లారు. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన మరో యువకుడు ఉపేందర్ తీవ్రంగా గాయపడి ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. గాజ సవిత అంత్యక్రియులు గురువారం జరగనున్నాయి.
భైంసాటౌన్, జూలై13 : పాంగ్రి గ్రామానికి చెందిన జంగ్మే అమృత్ (45) కుమారుడు ఆసిఫాబాద్ వసతి గృహంలో చదుకుంటున్నాడు. కొడుకును తీసుకరావడానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అమృత్‌కు ఇద్దరు భార్యలు, ముగ్గురు కుమారులు ఉన్నారు.
మానవత్వం చాటుకున్న అదనపు కలెక్టర్
ఇంద్రవెల్లి, జూలై13 : ఉట్నూర్ మండలం గోదరిగూడెం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలతో కోట్టుమిట్టులాడుతున్న బాధితులను ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ స్వయంగా ఇంద్రవెల్లి పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ప్రమాద సమయంలో అటువైపుగా వెళ్తున్న అదనపు కలెక్టర్ కొన ఉపిరితో కొట్టుమిట్టాడుతున్న నలుగురిని తన సొంత వాహనంలో ఇంద్రవెల్లి పీహెచ్‌సీకి తరలించారు. తీవ్రగాయాలై కోన ఉపిరితో ఉన్న ఇద్దరు మహిళలతోపాటు ఓ వ్యక్తి అప్పటికే మృతి చెందారు. ముగ్గురి మృతదేహాలను జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు ఎస్ఐ డి సునీల్ తరలించారు. ఉట్నూర్ పోలీసులకు సమాచారం అందించారు.