ఎదులాపురం,జూలై 8: డెంగీ, మలేరియా, డయేరియా, టైఫాయిడ్ తదితర సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మున్సిపల్, వైద్యాధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపట్టవలసిన చర్యలపై కలెక్టరేట్లో మున్సిపల్, వైద్యారోగ్య, వార్డుల ప్రత్యేక అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. డెంగీ, మలేరియా వంటి వ్యాధుల నియంత్రణకు పట్టణంలోని ప్రతి వార్డులో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటి వరకు వివిధ వార్డుల్లో 38 డెంగీ కేసుల నమోదైనట్లు తెలిపారు. 54 హైరిస్క్ ప్రాంతాలను గుర్తిం చినట్లు వెల్లడించారు. వార్డుల్లోని ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలించాలన్నారు.
ప్రతి మంగళ, శుక్రవారాల్లో మున్సిపల్ అధికారులు వార్డు ప్రత్యేక అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో డ్రై డే నిర్వహించాలని సూచించారు.ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, రిమ్స్ వైద్య కళాశాల విద్యార్థులతో పరిసరాల పరిశుభ్రతపై డ్రై డే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆశ, ఏఎన్ఎంలు, హెల్త్ సూపర్వైజర్లు,వైద్య సిబ్బంది ఫీవర్ సర్వే నిర్వహించాలని, ప్రతి ఇంటికీ స్టిక్కర్ అతికించాలన్నారు. ఖాళీ స్థలాలను శుభ్రం చేసుకునే విధంగా యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. లేని పక్షంలో మున్సిపల్ ద్వారా చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలు, రైతుబజార్, వ్యాపార సముదాయాల్లో అవగాహన కల్పించాలన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం చూపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రిమ్స్‌లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా వైద్యసేవలు అందించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని డైరెక్టర్, వైద్యాధికారికి సూచించారు. అనంతరం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో తల్లిపిలుపు కార్యక్రమం పోస్టర్‌ను కలెక్టర్ విడుదల చేశారు. సమావేశంలో డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ శైలజ, అదనపు వైద్యాధికారి డాక్టర్ మనోహర్, వార్డు ప్రత్యేక అధికారులు ఉన్నారు.