
పండించే పంట లాభం తెచ్చి పెట్టాలి.. రైతు ధనవంతుడు కావాలి.. ఈ లక్ష్యంతోనే రాష్ట్ర సర్కారు వినూత్న పంట లను ప్రోత్సహిస్తున్నది. అందులో భాగంగానే సిరులు కురిపించే ఆయిల్ పామ్‌ను వేయాలని అన్నదాతకు సూచిస్తున్నది. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ఉద్యానవన శాఖ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని మదనాపూర్లో ఆయిల్ పామ్ నర్సరీని ఏర్పాటు చేసి 50 వేల మొక్కలను పెంచుతున్నారు. ఇప్పటివరకు 700 ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు దరఖాస్తులు కూడా చేసుకున్నారు. వచ్చే యేడాది ఆగస్టులో మొక్కలు నాటేందుకు అధికా రులు ప్రణాళికలు తయారు చేశారు. 25 నుంచి 30 ఏండ్ల వరకు ఆదాయాన్నిచ్చే ఈ సాగు వివరాలపై ప్రత్యేక కథనం..
ఆదిలాబాద్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పత్తి, సోయా, కంది, శనగ, జొన్న వంటి పంటలు అధికంగా వేస్తారు. రైతులు సంప్రదాయ పంటలకు బదులు వాణిజ్య పంటలు వేసుకోవాలని సర్కారు సూచిస్తున్నది. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూ.. రైతులకు సబ్సిడీ ఇస్తున్నది. ఒక్కో మొక్క పెంచడానికి రూ.117 ఖర్చు కానుండగా.. ప్రభుత్వం రూ.84 సబ్సిడీ ఇస్తున్నది. మిగతా రూ.33 రైతులు చెల్లించాలి. మొదటి సంవత్సరం మొక్కల ఖర్చుకు ఎకరాకు రూ.4,784 ఇస్తున్నది. పంట వేసినప్పటి నుంచి నాలుగేళ్ల వరకు ఎకరాకు రూ.2వేలు ఎరువుల కోసం సర్కారు అందిస్తున్నది. నాలుగో సంవత్సరం ఎరువులతోపాటు అంతర పంటల కోసం రూ.8 వేల సబ్సిడీని ఇస్తున్నది. డ్రిప్ పరికరాల కోసం రూ.25 వేలు ఖర్చు కానుండగా.. సబ్సిడీపై అందజేస్తున్నది. ఆయిల్ పామ్ టన్ను పామాయిల్ గెల ధర రూ.16వేలుగా ఉంది. ఎకరాకు 10 టన్నుల దిగుబడి వస్తుంది. ఎకరాకు సాగు ఖర్చు రూ.30 వేలు కానుండగా.. 1.60 లక్షల ఆదాయం వస్తుంది. అంతర పంటల ద్వారా కూడా రైతులు ఆదాయం పొందవచ్చు.
జిల్లాలో నర్సరీ..
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం మధనాపూర్లో అధికారులు ఆయిల్ పామ్ నర్సరీ ఏర్పాటు చేశారు. ఇం దులో 50వేల మొక్కలు పెంచుతున్నారు. 12 నుంచి 14 నెలలు పెంచి.. సాగునీటి సౌకర్యం ఉన్న రైతులను గుర్తిస్తారు. వచ్చే జూలై కల్లా గుంతలు తవ్వడం పూర్తి చేసి ఆగస్టులో మొక్కల పెంపకం చేపడుతారు. జిల్లాలో ఇప్పటివరకు 700 ఎకరాల్లో సాగుకు రైతులు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు.
నేలలు : ఆయిల్‌పామ్ సాగుకు అన్ని రకమైన నేలలు అనుకూలం. నీరు నిలువని లోతైన ఒండ్రు నేలలు, అధిక సేంద్రియ పదార్థం కలిగి నీరు తేలికగా ఇంకిపోయే గుణం నేలలకు ఉండాలి.
నీటి వినియోగం : అధిక దిగుబడి ఇచ్చేందుకు సమృద్ధిగా నీరు అవసరం. వేసవిలో కూడా నీరు పుష్కలంగా అందించాలి. ఎకరా వరి సాగుకు అవసరమయ్యే నీటితో 3 నుంచి 4 ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేయవచ్చు.
మొక్కల ఎంపిక : 12 నుంచి 14 నెలల వయస్సు. 1-1.2 మీటర్ల ఎత్తు, 20-25 సెంటీ మీటర్ల కాండం మొదలు చుట్టు కొలత కలిగి 12-13 ఆకులతో ఆరోగ్యంగా ఉన్న నర్సరీ మొక్కను నాటాలి. 60 సెంటీమీటర్ల పొడువు, 60 సెం.మీ వెడల్పు, 60 సెం.మీ లోతులో గుంతలు తీసి మొక్కలు నాటాలి. ఎకరాకు 57 మొక్కలను మాత్రమే నాటాల్సి ఉంటుంది.
మొక్కలు నాటే సమయం : నీటి వసతి పుష్కలంగా ఉన్న భూముల్లో ఎప్పుడైనా మొక్కలు నాటుకునే అవకాశం ఉంటుంది. జూన్ నుంచి డిసెంబర్ వరకు అనుకూలమైన సమయం. నాటే గుంతల్లో 1-2 గంపల పశువుల ఎరువు, 400 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 200 గ్రాముల డీఏపీ, 50 గ్రాముల ఫోరేట్ గుళికలు వేసి కలిపిన మట్టితో నింపాలి. మొక్కకు ఉన్న ప్లాస్టిక్ సంచిని నిలువునా కోసి.. తీసివేసి మట్టితో గుంతలో నాటాలి. తలభాగం మట్టి లో కురుకుపోకుండా చూడాలి. మొక్కల చుట్టూ మొదటి సంవత్సరంలో 1 మీటరు వ్యాసార్థం, రెండో సంవత్సరం 2 మీటర్ల వ్యాసార్థం, మూడో సంవత్సరం 3 మీటర్ల వ్యాసార్థంలో పాదులు వేయాలి. పాదుల్లో మల్చింగ్, జనుము నాటితే మొక్కలను వేడి గాలి నుంచి కాపాడుకోవచ్చు. నేలల్లో తగినంత తేమ ఉండాలి. నీటిని నిల్వ ఉంచవద్దు.
సాగునీటి యాజమాన్యం : మొక్కలకు తగినంత తేమ ఉండేలా చూడాలి. నీరు సరిగ్గా అందకపోతే ఆకుల పెరుగుదల తగ్గిపోతుంది. పాదుల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మూడు సంవత్సరాలు దాటిన మొక్కకు వానకాలంలో 100-150 లీటర్లు, చలికాలంలో 160-170 లీటర్లు, ఎండాకాలంలో 215-256 లీటర్ల నీటిని రోజూ అందించాలి. ఎండాకాలంలో వడగాలుల తీవ్రత ఉంటే రోజు 300-350 లీటర్ల నీరు అవసరమవుతుంది. మొక్కను నాటిన తర్వాత మొదటి దఫా ఎరువు మూడు నెలల తర్వాత వేయాలి. కలుపు తీసిన పొదల్లో చెట్టు మొదలు నుంచి 2 అడుగులు దూరంలో పీచువేళ్లు ఎ క్కువగా ఉండే చోట పాదు చుట్టూ ఎరువులు చల్లి మట్టితో కలిపి వెంటనే నీరు అందించాలి. బిందుసేద్యం పరికరం ద్వారా ఎరువులు అందిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
అంతర సాగు : ఆయిల్ పామ్ తోటల్లో మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. మొక్కలు పెట్టిన తర్వాత మూడేళ్ల వరకు అంతర పంటలను వేసుకునే అవకాశం ఉంటుంది. మక్కజొన్న, అరటి, పొద్దు తిరుగుడు, మిరప, సోయా, పసుపు, పెసర, అలసంద, నువ్వులు, వేరుశనగ, కూరగాయలను అంతర పంటలుగా వేసుకోవచ్చు. ఆయిల్ పామ్‌లో పరపరాగ సంపర్కం గాలి, కీటకాల ద్వారా జరుగుతుంది.
గెలల దిగుబడి : ఆయిల్ పామ్ గెలల దిగుబడి నాలుగో సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది. ఏడో సంవత్సరం నుంచి దిగుబడి నిలకడగా వస్తుంది. ఎకరానికి సగటు 10-12 టన్నుల గెలల దిగుబడి వస్తుంది. పక్వానికి వచ్చిన గెలలను మాత్రమే కోస్తారు. పచ్చి గెలలు కోస్తే నూనె శాతం తగ్గి వ్యర్థాలు ఎక్కువగా వస్తాయి. గెలలు కోసేటప్పుడు కాడ పొడవు 5 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉండాలి. 10-15 రోజుల వ్యవధిలో గెలలు కోయవచ్చు. నాలుగో సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమై 25 నుంచి 30 సంవత్సరాల వరకు వస్తుంది.
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..
ఆదిలాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగులో భాగంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. సాగుతో కలిగే లాభాలను రైతులకు తెలియజేస్తున్నాం. చాలా మంది రైతులు ఆయిల్ పామ్‌ను సాగు చేయడానికి ముందుకొస్తున్నారు. తలమడుగు మండలం మధనాపూర్లో నర్సరీని ఏర్పాటు చేసి 50 వేల మొక్కలను పెంచుతున్నాం. 12-14 నెలల తర్వాత మొక్కలు నాటేందుకు సిద్ధమవుతాయి. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి జిల్లాలోని రైతుల భూముల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు తయారు చేశాం.