బోథ్/బజార్హత్నూర్/నిర్మల్అర్బన్/ కుం టాల/ ఇంద్రవెల్లి/ కడెం/భైంసా/పెంబి, జూలై 5 :ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరు వాన కురిసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా పడింది. వాగులు.. వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, అక్కడక్కడా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పలుచోట్ల చెరువులు మత్తళ్లు దుంకుతుండగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కడెం ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతుండగా, అధికారులు గేటు ఎత్తి 3 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. గోదావరి తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం జనగామలో పిడుగు పడి 12 మేకలు, 8 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారు జాము వర కు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బోథ్ మండలం బోథ్ మండలంలోని ధన్నూర్ (బీ), అందూర్ ప్రాంతంలోని వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. ధన్నూర్ (బీ), మందబొగుడ, రఘునాథ్‌పూర్, అందూర్ వాగుల వంతెనలపై నుంచి నీరు ప్రవహించింది. ఖండిపల్లె సమీపంలో పైపు కల్వర్టు వద్ద రోడ్డు కోతకు గురవడంతో ప్రమాదకరంగా మారింది. బజార్హత్నూర్ మండలకేంద్రంలోని చెరువు నిండుకుండాల మారింది. చెరువు ఆలుగుపై నుంచి వరద ఉధృతంగా ప్రవాహిస్తున్నది. గ్రామస్తులు చేపలు పట్టారు. బలన్‌పూర్ గ్రామసమీపంలోగల కనకాయ జలపాతానికి జలకళ వచ్చింది. పచ్చని అడవి మధ్యలో ఎతై న ప్రదేశాల నుంచి జాలువారుతున్న నీరు చూపరులను ఎంతోగాను ఆకట్టుకుంటున్నది. ఇంద్రవెల్లి మండలంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. నిర్మల్ జిల్లా లో మంగళవారం 41.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కుంటాలలో భారీ వర్షం కురిసింది.
నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద వచ్చి చేరడంతో నిండుకుండాల మారింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మ ట్టం 700 అడుగులు(7.603 టీఎంసీలు) కాగా, ప్రస్తుత నీటి మట్టం 692.125అడుగులు (5. 932) టీఎంసీలు ఉంది. 9,342 క్యూసెక్కుల వరద వస్తుండగా, ఒక్క గేటు ఎత్తి దిగువలకు 3 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పెంబి మండలం దొత్తివాగు ఉధృతంగా ప్రవహిస్తుం డడంతో ఆవల ఉన్న రాంనగర్, యాపల్‌గూడ ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెరువు లు, కుంటల్లోకి వరద చేరుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొలాలు వర్షపు నీటితో చెరువులను తలపిస్తున్నాయి. భైంసా పట్టణంలోని మురుగు కాలువలు నిండుగా ప్రవహించాయి. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది జూన్ 1 నుంచి జూలై 5 వరకు 242.6 మి.మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 356.7 మి.మీటర్ల వర్ష పాతం నమోదైంది. కుమ్రం భీం, వట్టివాగు ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరుతున్నది. వాగులు, ఒర్రెల్లో వరద చేరడంతో చేపలు వస్తుండడంతో ఆయా గ్రామాల ప్రజలు చేపలు పట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. లింగాపూర్ మండలం ఖీమనాయక్ తండా వంతెన ఉప్పొంగి ప్రవహించడంతో లింగాపూర్ అంగడికి వచ్చిన దంపూర్ ప్రాంత ప్రజలు తిరిగి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు.
మంచిర్యాల జిల్లాలో జిల్లా వ్యాప్తంగా మంగళ వారం 22.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది జూన్ ఒకటవ తేదీ నుంచి మంగళ వారం వరకు 242.6 మిల్లీ మీటర్లు కురియాల్సి ఉండగా 301.7 మిల్లీ మీటర్లు కురిసింది. అంటే 24 శాతం అధిక వర్షపాతం నమోదైంది. కోటపల్లి మండలంలోని జనగామ గ్రామంలోని దొంతల రాజుకు చెందిన 20 మూగజీవాలు పిడుగుపాటుతో మృతి చెందాయి. రాజు తన గొర్లు, మేకలను సూపాక గ్రామం వైపు ఉన్న అటవీ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లాడు.
ఇక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో సమీపంలో ఉన్న చెట్టు కిందకి వెళ్లాడు. ఒక్కసారిగా పిడుగుపాడడంతో 12 మేకలతో పాటు 8 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందగా, దొంతల రాజు సృహ తప్పి అక్కడే పడిపోయాడు. అటువైపుగా వెళ్తున్న వారు గమనించి రాజును వైద్యం కోసం దవాఖానకు తరలించారు. మరో 10 మూగజీవాలు పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉండడంతో వైద్యులు చికిత్స ని ర్వహిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని సర్పంచ్ లక్ష్మణ్ గౌడ్, ఎంపీటీసీ మారిశెట్టి తిరుపతి సందర్శించారు. బాధితులను ఓదార్చి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నష్ట పరిహారం చెల్లించి బాధితుడిని ఆదుకోవాలని కోరుతున్నారు.