ఎదులాపురం ,జూలై 5 : ప్రజాప్రతినిధుల సహకారం ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. ఆదిలాబాద్‌లోని జడ్పీ సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన మంగళవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, ఆరోగ్యం, మిషన్ భగీరథ, విద్య, విద్యుత్, గ్రామీణాభివృద్ధి, నీటి పారుదల, రోడ్లు భవనాలు, గిరిజన సంక్షేమ, పంచాయతీ, అటవీ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జడ్పీచైర్మన్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులు ప్రగతి నివేదికలు వివరించి జడ్పీటీసీలు, ఎంపీపీలు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడిగిన సమస్యలకు సమాధానం చెప్పాలన్నారు.
జిల్లాలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధుల సహకారంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించే దిశగా పని చేయాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం రాయితీపై నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రిమ్స్‌లో రూ.11.65 కోట్లతో ఎంఆర్ఐ ఏర్పాటు చేయడానికి సహకరించిన సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ రైతుల పంట పొలాల్లో మట్టి నమూనాల పరీక్షలకు నిధులు కేటాయించడానికి కమిషనర్‌కు లేఖ రాశామన్నారు.
శాస్త్రవేత్తల సర్వే మేరకు వానకాలంలో సోయా విత్తనాలు మొలకెత్తలేని కారణంగా సంబంధిత విత్తన కంపెనీ నుంచి రైతులకు నష్టపరిహారం అందించేందుకు కమిటీ వేశామని తెలిపారు. ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ సభ్యులు లేవనెత్తిన అంశాలకు సమాచారాన్ని తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలో నకిలీ విత్తనాలు సరఫరా, అమ్మకాలపై నిఘా పెట్టాలన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ జడ్పీ సమావేశం మినీ అసెంబ్లీ లాంటిదనీ, 90 రోజులకు ఒక సారి నిర్వహించే ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉంటాయన్నారు. ఈ సమస్యలు పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం సమష్టిగా పని చేయాలని సూచించారు.
మన ఊరు-మన బడి కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యాల ద్వారా పనులు చేపట్టాలన్నారు. 2018-19 సంవత్సరంలో పసల్ బీమా రైతులకు అందలేదని,అట్టి జాబితా సభ్యలకు అందించాలని సూచించారు. ఉపాధి హామీ కూలీల డబ్బులు ఏప్రిల్ నుంచి చెల్లించలేదని అట్టి జాబితా అందించాలని కోరారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాలన్నారు. విత్తనాలు, ఎరువుల సరఫరాకు 52 సొసైటీలు ఇండెంట్ సమర్పించామని తెలిపారు. ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన గిరిజన నిరుద్యోగ యువతకు మెగా ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు. 33 కంపెనీల్లో 2300 ఉద్యోగాలు కల్పించడానికి మేళాను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతకుముందు సర్వసభ్య సమావేశానికి మొట్టమొదటి సారిగా హాజరైన ఎమ్మెల్సీ దండే విఠల్‌ను సభ్యులు శాలువాతో సన్మానించారు.
సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మానోహార్, జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్, జడ్పీ సీఈవో గణపతి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కో- ఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.