
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, చిన్నారులు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నది. ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే పోషణ మాసోత్సవాలను జిల్లాలో ప్రారంభించింది. నెల రోజులపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారంపై ఊరూరా అవగాహన కల్పించనున్నది. మరోవైపు అంగన్వాడీ కేంద్రాలు, ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 30 నుంచి 40 న్యూట్రీగార్డెన్లు ఏర్పాటు చేసి, పాలకూర, చుక్కకూర, గోంగూర, టమాట, బెండ, బొప్పాయి, పుదీనావంటివి పండించేందుకు ప్రణాళికలు రూపొందించింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబరు 4 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనతను నివారించి సంపూర్ణ ఆరోగ్యం కలిగించేందుకు ప్రభుత్వం పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టింది. బాలింతలు, గర్భిణులకు ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవడం, ఆర్థిక స్థోమత కారణంగా అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులను తీర్చేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఇప్పటికే బలోపేతం చేసింది. ముఖ్యంగా పోషకాహార లోపాన్ని తీర్చేందుకు పాలు, గుడ్లు, ఆకుకూరలు, కూరగాయలు, బాలామృతం వంటి పదార్థాలను అం దిస్తున్నది. వీటిని గర్భిణులు, బాలింతలు, పిల్లలు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా అవగాహన క ల్పిస్తూ ప్రత్యేకంగా పోషణ్ అభియాన్ మాసాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 973 అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించారు. 973 అంగన్వాడీ కేం ద్రాల పరిధిలో 5386 మంది గర్భిణులు, బాలింతలు 4335, పిల్లలు 41,190 మంది ఉన్నారు. వీరిలో తీవ్రమైన పోషకాహార లోపంతో 1174 మంది, సాధారణ పోషకాహార లోపంతో 3425 మంది బాధపడుతున్నట్లు గతేడాది గుర్తించారు. వీరికి ప్రత్యేక ఆహారం అందించారు.
తగ్గిన మాతాశిశుమరణాలు..
ప్రభుత్వం చేపడుతున్న ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటికే మాతా శిశుమరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా గర్భిణులకు ప్రసవ సమయంలో రక్తహీనత లేకుండా చేయడంలో అంగన్వాడీ కేంద్రాల్లోని ఆహారం ఎంతో ఉపయోపడుతున్నది. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అనేక రకాల అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లాలోని 654 అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రీ గార్డెన్స్ని గతేడాది ఏర్పాటు చేసి పౌషకాహారం అందేలా చర్యలు తీసుకున్నారు. పిల్లల్లో ఎత్తుకు తగిన బరువు, బాలింతలు, గర్భిణుల్లో పోషకాహార లోపం నివారణకు న్యూట్రీగార్డెన్లు ఎంతో ఉపకరించనున్నాయి. వచ్చే యాసంగి సీజన్ నుంచి ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిధిలో 30 నుంచి 40 న్యూట్రీగార్డెన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.