నిర్మల్ చైన్‌గేట్, జూలై 2 : నిర్మల్ జిల్లా మామాడ మండలం రాయదారి గ్రామానికి చెందిన బావుసింగ్, మోకాలి నొప్పులతో 20 ఏండ్లుగా బాధపడుతున్నాడు. ప్రైవేటు దవాఖానలో శస్త్రచికిత్సకు రూ.2.50 లక్షలు ఖర్చవుతుండడంతో అక్కడికి వెళ్లలేక, నిర్మల్ ప్రభుత్వ దవాఖానలో వైద్యులను సంప్రదించాడు. సూపరింటెండెంట్ దేవేందర్‌రెడ్డి నేతృత్వంలో వైద్యులు రఘునందన్‌రెడ్డి, ప్రమోద్‌చంద్రారెడ్డి, విజయ్‌రెడ్డి, అరుణ్‌రెడ్డి వైద్య బృందం, ఆరోగ్య శ్రీ ద్వారా మోకాలి కీలు మార్పిడి చేసింది.
శస్త్రచికిత్స విజయవంతమవగా, శనివారం ఆయనను డిశ్చార్జి చేశారు. కాగా, నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ వైద్య బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రధాన దవాఖానలో రోగులకు 24 గంటల వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఇటీవల కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యేక బృందాలను పంపించాయని తెలిపారు. కాయకల్ప అవార్డుతో పాటు, జాతీయ స్థాయి ఎన్‌క్యాష్ అవార్డు లభించిందన్నారు. గతంలో ఏదైనా జబ్బు వస్తే హైదరాబాద్‌కు రెఫర్ చేసేవారని, ఇప్పుడు నిర్మల్‌లోనే వైద్యం అందిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం దవాఖానలో రోగుల సంఖ్య పెరిగిందన్నారు. ఆ తర్వాత జిల్లా ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేసిందన్నారు. ఆస్పత్రిలో అన్ని రకాల వసతులున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మిరాంకిషన్రెడ్డి దవాఖాన అభివృద్ధికి కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంవో వేణుగోపాలకృష్ణ, వైద్యులు ప్రమోద్ చంద్రారెడ్డి, రఘునందన్‌రెడ్డి, విజయ్‌రెడ్డి, అరుణ్‌రెడ్డి, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది మనోహర్, రమ్య తదితరులు పాల్గొన్నారు.