ఎదులాపురం, జూన్ 27 : ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ రేషన్ డీలర్లను ఆదేశించారు. కలెక్టర్ కార్యాయ సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో చౌకధరల దుకాణాదారులకు విజన్ టెక్ సౌజన్యంతో ఈ పాస్ మిషన్లపై సోమవారం శిక్షణ నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. చౌకధరల దుకాణాదారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రానీయవద్దన్నారు.
ప్రతినెలా సకాలంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని సూచించారు. గతంలో 2జీ నెట్వర్క్ ద్వారా సాంకేతిక సమస్యలు తలెత్తేవన్నారు. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం 4జీ నెట్వర్క్ ద్వారా నూతన సాంకేతిక మిషన్లను పంపిణీ చేస్తున్నదని చెప్పారు. వేలిముద్ర, ఐరిస్, నూతన సాంకేతిక యంత్రాల ద్వారా లబ్ధిదారులను గుర్తించి సరుకులను పంపిణీ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ-పాస్ యంత్రంపై ప్రతి రేషన్ డీలర్ పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. అంతకుముందు విజన్ టెక్ సర్వీస్ ఇంజినీర్లు ఈ-పాస్ యంత్రాలపై అవగాహన కల్పించారు. అనంతరం అదనపు కలెక్టర్లు రేషన్ డీలర్లకు ఈ-పాస్ యంత్రాలు పంపిణీ చేశారు. ఆర్డీవో రాథోడ్ రమేశ్, డీఎస్వో సుదర్శన్, సర్వీస్ ఇంజినీర్లు హరినాథ్, నాగరాజ్, కోఆర్డినేటర్ అశోక్, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.