ఆదిలాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ సంఖ్యలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ చేపట్టింది. 80,039 ఉద్యోగాలను భర్తీ చేయనుండగా.. ఇప్పటికే పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లను విడుదల చేసింది. సర్కారు కొలువులు సాధించాలనే లక్ష్యంతో నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ స్టడీ సర్కిళ్లలో శిక్షణ తీసుకుంటూ, గ్రంథాలయాల్లో వివిధ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. నిరుద్యోగ యువత కొలువులు సాధించడానికి ‘నమస్తే తెలంగాణ’ అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తున్నది. ప్రతి జిల్లా ఎడిషన్‌లో నిపుణ పేరిట నాలుగు పేజీలు ఇస్తున్నది. దీంతోపాటు విద్యార్థులు పోటీ పరీక్షలు ఎలా రాయాలనే విషయాలపై నిపుణులతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నది.
నేడు(సోమవారం) ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జనార్దన్‌రెడ్డి గార్డెన్లో జోగు ఫౌండేషన్ సౌజన్యంతో ఉదయం 10 గంటలకు పోటీ పరీక్షలపై అవగాహన నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌కు చెందిన సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు, వేప అకాడమీ డైరెక్టర్ డాక్టర్ వేపలు హాజరై విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ముషారఫ్ అలీ ఫారూఖీ, ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి హాజరవుతారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు అంటున్నారు. ఈ అవగాహన సదస్సు నిర్వహణతో పోటీ పరీక్షల విషయంలో ఉన్న ఆందోళనలు దూరమవుతాయని, నిపుణుల సలహాలు, సూచనలు ప్రయోజనకరంగా ఉంటాయని, సందేహాలు నివృత్తి అవుతాయని ఉద్యోగార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.