ఎదులాపురం, జూన్ 26 : రాజీమార్గమే రాజమార్గమని ఆదిలాబాద్ జిల్లా జడ్జి ఎంఆర్ సునీత అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కోర్టులో ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు మంచి స్పందన లభించింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు లోక్ అదాలత్ కొనసాగింది. కోర్టులో కక్షిదారుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ముందుగా డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయమూర్తులు, పీపీలు, న్యాయవాదులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి , డీఎల్ఎస్ఏ చైర్పర్సన్ ఎంఆర్ సునీత మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసులు జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవడంతో ఇరువురికి న్యాయం జరుగుతుందన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లో 3721 కేసులు పరిష్కారం అయ్యాయని తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు మాధవీకృష్ణ, సతీశ్‌కుమార్, ఉదయ్‌భాస్కర్‌రావు, డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్‌పాండే, మంజుల, యశ్వంత్ సింగ్ చౌహాన్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, డీఎస్పీ ఉమేందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్, పీపీలు, న్యాయవాదులు, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, బ్యాంకు, ట్రాఫిక్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
బోథ్ కోర్టు ప్రాంగణంలో..
బోథ్ కోర్టు ప్రాంగణంలో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీజే కోర్టు జడ్జి హుస్సేన్ మాట్లాడుతూ రాజీమార్గం మధ్యవర్తిత్వం ద్వారా 102 ఎస్టీసీలు, 290 బ్యాంకు అదాలత్, 40 నేరం ఒప్పందాల ద్వారా పరిష్కరించినట్లు తెలిపారు. బోథ్ ఎస్బీఐకి 31 మంది నుంచి రూ.44,75,000, ఇచ్చోడ ఎస్బీఐకి 19 మంది నుంచి రూ.1,35,000 రికవరీ చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ పంద్రం శంకర్, ఠాకూర్ రూపేందర్ సింగ్, హరీశ్, దమ్మాపాల్, సీఐ నైలు, ఎస్ఐలు రవీందర్, ఉదయ్‌కుమార్, ముజాయిద్, మహేందర్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం
కేసుల సత్వర పరిష్కారమే లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశమని మండల న్యాయసేవా సంస్థ చైర్మన్ కర్ణ కుమార్ అన్నారు. జిల్లా న్యాయస్థానంలో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19 బ్యాంకు కేసులు, 750 మొత్తం కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. న్యాయమూర్తులు అజేశ్ కుమార్, రామలింగం, ఏపీపీ సతీశ్ పాల్గొన్నారు.
భైంసాలో..
లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని భైంసా న్యాయమూర్తి ఈశ్వరయ్య పేర్కొన్నారు. పట్టణంలోని కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 484 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ లోక్‌అదాలత్‌లో న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.
న్యాయం జరిగింది
నాది మామడ మండలం కొత్తూరు గ్రామం. నాకు గ్రామంలో ఉన్న మూడెకరాలపై బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రలో 2018లో లక్షా 20 వేలు లోన్ తీసుకున్నాను. పంటలు పండకపోవడంతో బ్యాంకు ఇచ్చిన రుణం నాలుగేళ్లుగా చెల్లించలేదు. బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చిండ్రు. కోర్టులో కేసు పెట్టిండ్రు. మొత్తం రుణం వడ్డీతో కలిపి రూ.2లక్షల90 వేలు కావడంతో చెల్లించలేనని మొరపెట్టుకున్నా. బ్యాంకు అధికారులు లోక్ అదాలత్‌లో వన్ టైం సెటిల్మెంట్ కింద రూ.లక్షా 25 వేలకే ఒప్పుకోవడంతో ఆ డబ్బులు చెల్లించి లోక్ అదాలత్‌లో కేసు పరిష్కరించుకున్నా. ఇటువంటి లోక్ అదాలత్ నిర్వహించడం వల్ల పేదలకు న్యాయం జరుగుతది.
-కొరిపెల్లి పాపవ్వ
రాజీ కేసులను పరిష్కరించాం
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహిస్తూ పెండింగ్ కేసులు పరిష్కరిస్తున్నాం. ఇప్పటి వరకు ఎనిమిది సార్లు లోక్ అదాలత్ నిర్వహించాం. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపై ఇరువర్గాలతో చర్చలు జరిపి రాజీకి వచ్చిన కేసులను లోక్ అదాలత్ ద్వారా కొట్టివేస్తున్నాం. ముఖ్యంగా కోర్టు పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్, చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారికి లోక్ అదాలత్ ద్వారా విచారించి కొంత జరిమానా విధించి కేసులను కొట్టివేస్తున్నాం. మండల న్యాయసేవాసంస్థ ఆధ్వర్యంలో ఉచిత లోక్ అదాలత్‌పై అవగాహన కల్పిస్తున్నాం. -కర్ణకుమార్, నిర్మల్ జిల్లా జడ్డి