కాగజ్నగర్ రూరల్, జూన్ 25: విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి అన్నారు. మండలంలోని గన్నారంలో తెలంగాణ గిరిజన సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలను శనివారం సిర్పూర్ (టీ) ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కుమ్రం భీం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్పాయితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో గిరిజన పాఠశాలలు, కళాశాలలు, కేజీబీవీలను నెలకొల్పి కార్పొరేట్ స్థాయిలో విద్యనందిస్తున్నట్లు తెలిపారు.
నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లిష్ గ్రామర్ పుస్తకాలు అందజేయడంతో గతేడాది రాష్ట్రంలోనే మన జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. సకల సౌకర్యాలతో ప్రభుత్వం గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఐటీడీఏ నిధులు రూ. 4.2 కోట్లతో భవనం నిర్మించినట్లు తెలిపారు. అంతకుముందు కళాశాలను ప్రారంభించేందుకు వచ్చిన అతిథులకు కళాశాల అధ్యాపకులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, ఎంపీపీ చీపురుశెట్టి శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, సర్పంచ్ శ్రీనివాస్, గ్రామస్తులు, కళాశాల ప్రిన్సిపాల్ రమ్యకృష్ణ, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.