బెజ్జూర్, జూన్ 6 : ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా సోమవారం బెజ్జూర్ మండలంలోని గబ్బాయి పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావుతో కలిసి ఆమె పనులు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వమూ పాఠశాలల అభివృద్ధిపై దృష్టి సారించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టిన మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో అన్ని వసతులు సమకూర్చి ఆంగ్ల బోధన ప్రవేశపెట్టిందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని సూచించారు. స్కూల్ కమిటీ సమావేశాలను ప్రతి నెలా నిర్వహించాలన్నారు.
గబ్బాయి పాఠశాలకు రూ.5.36 లక్షల నిధులు మంజూరైనట్లు ఏఈ మక్బు ల్ తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో జడ్పీ చైర్పర్సన్ మొక్క నాటారు. అనంతరం జడ్పీటీసీ పుష్పలత సోదరుడి వివాహ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వడ్డెపల్లి లావణ్య, ఎంపీపీ డోకె రోజా రమణి, సహకార చైర్మన్ కుర్సింగ ఓంప్రకాశ్, ఎంపీడీవో మాధవి, మండల ప్రత్యేక అధికారి సురేశ్ బాబు, ఎంఈవో రమేశ్‌బాబు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సిడం సకారాం, ఎంపీవో వీర భద్రయ్య, కోఆప్షన్ సభ్యుడు బషారత్ ఖాన్, ఓయూ విద్యార్థి సెగ్యం వినోద్, నాయకులు డోకె వెంకన్న, నరేందర్ గౌడ్, కొట్రంగి రామకృష్ణ, జాహిద్ హుస్సేన్, సీహెచ్ దేవాజి, నైతం సత్తయ్య, తంగెడిపల్లి మహేశ్, ఎస్ఎంసీ చైర్మన్ కొడ్ప శంకర్, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.