తలమడుగు, జూన్ 6 : తమ వ్యవసాయ భూమిని కబ్జా చేశారన్న మనస్థాపంతో తండ్రీకొడుకులు ఆత్మహత్య చేసుకోగా, వారి కుటుంబానికి కజ్జర్ల గ్రామస్తులు అండగా నిలిచారు. అబ్దుల్ ఘని కుటుంబ సభ్యులు దాడి చేసి, భూమికి కంచె ఏర్పాటు చేయడంతో జైపాల్‌రెడ్డి, చరణ్ రెడ్డి ఆదివారం పురుగుల మందు తాగిన విషయం తెలిసిందే. కాగా, వారికి మద్దతుగా సోమవారం సుమారు 300 మంది రైతులు ఎడ్లబండ్లతో పొలానికి చేరుకున్నారు. వ్యవసాయ పనులు మొదలుపెట్టి, పొలంలో పత్తి, కంది విత్తనాలను వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డిపై దాడిచేసిన ఆసిఫ్, యూసుఫ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు చెందిన 8 ఎకరాల భూమికి అధికారులు వెంటనే పట్టా జారీ చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామన్నారు.
ఎమ్మెల్యే పరామర్శ..
ఆత్మహత్యాయత్నానికి పాల్పడి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న తండ్రీ కొడుకులు జైపాల్ రెడ్డి, చరణ్ రెడ్డిని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పరామర్శించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి, బాధిత రైతు కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వారి వెంట టీఆర్ఎస్ పార్టీ నాయకులు మొట్టె కిరణ్ తదితరులు ఉన్నారు.