కోటపల్లి, మే 25 : అత్యవసరం అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది 108 అంబులెన్స్. విపత్కర సమయంలోనూ సమర్థవంతంగా సేవలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపును పొందారు 108 పైలెట్లు. వారి సేవలకు గుర్తింపుగా యేటా మే 26న జాతీయ పైలెట్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు అందిస్తున్న సేవలపై ‘నమస్తే’ కథనం..
రోడ్డు ప్రమాదం జరిగినా, ప్రసవ సేవలు అవసరం ఉన్నా, ఎవరైనా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా, గుండెపోటు వచ్చినా ఏ ఇతర అత్యవసర సేవలు అ యిన క్షణాల్లో గుర్తుకు వచ్చేది 108. అంబులెన్స్ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు తిరిగి దవాఖానకు చేరుకునేందుకు పైలెట్ (డ్రైవర్) పాత్ర ఎంతో కీలకం. విమానాలు నడిపేవారిని పైలెట్ అని పిలుస్తుండగా, మన దేశంలో అంబులెన్స్ డ్రైవర్లను పైలెట్‌గా పిలుస్తూ వారికి సముచిత గౌరవం అందిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి దవాఖానకు తీసుకువచ్చే సమయాన్ని గోల్డెన్ అవర్‌గా భావిస్తారు. ఆ సమయంలో పైలెట్ ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ ముల్యం చెల్లించాల్సి ఉంటుంది. వీటికి తోడు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఏదైనా ప్రమాదానికి గురైతే బాధితులతో పాటు పైలెట్, ఈఎంటీలకు కూడా ప్రమాదమే. ఇలాటి సవాళ్ళను ఎదుర్కొంటునే ప్రతి రోజూ వందలాది మంది బాధితులకు సకాలంలో దవాఖానకు చేరవేస్తున్నారు.
కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి..
కరోనా సమయంలో కొవిడ్ రోగులు, అనుమానితులు, ఎంతో మందిని దవాఖానకు తరలించడం , ఐసొలేషన్ సెంటర్‌కు తీసుకురావడం 108 సిబ్బంది పైలెట్లు, ఈఎన్టీలు చేశారు.
పైలెట్లకు ప్రత్యేక శిక్షణ..
108 పైలెట్లకు హైదరాబాద్‌లోని జీవీకే ఈఎంఆర్ఐ కార్యాలయంలో యేటా విడుదల వారీగా ప్రత్యేక శిక్ష ణ ఇస్తుంటారు. రోడ్డు ప్రమాద బాధితులకు ప్రథమ చికిత్స చేయడంతో పాటు అంబులెన్స్‌లో సుఖ ప్రస వం అయ్యేందుకు ఈఎంటీకి సహాయ పడేందుకు, గుండెపోటు బాధితుడికి సకాలంలో వైద్యం అందిచేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు.
ఉమ్మడి జిల్లాలో 129 మంది పైలెట్లు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 129 మంది పైలెట్లు విధులు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో 108 వాహనాలు 14 ఉండగా, 34 మంది పైలెట్లు, ఆదిలాబాద్ జిల్లాలో 19 వాహనాలు ఉండ గా 19 మంది, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 12 వాహనాలకు 28 మంది, నిర్మల్ జిల్లాలో 8 వాహనాలకు 20 మంది పైలెట్లు పనిచేస్తున్నారు.
108లో పని చేయడం సంతోషంగా ఉంది..
108 వాహనం ప్రారంభం నుంచి విధులు నిర్వహిస్తున్నా ను. ఏదైనా ఆపద జరిగినప్పు డు సకాలంలో వాహనాన్ని సంఘటనా స్థలానికి తీసుకెళ్లి, రెట్టింపు వేగంతో బాధితులను దవాఖానకు తీసుకురావడం సవాల్ లాంటింది. విధి నిర్వహణలో ఇబ్బందులు ఉన్నప్పటికీ 108 పైలెట్ ద్వారా వేలాది మందికి సహాయం చేయడం సంతోషంగా ఉంది.
-సుంకె సతీశ్, పైలెట్ కోటపల్లి (మంచిర్యాల జిల్లా)
గోల్డెన్ అవర్ కీలకం..
108 అంబులెన్స్ నిర్వహణలో పైలెట్ పాత్ర కీలకం. ప్ర మాదం జరిగినప్పుడు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను దవాఖానకు సకాలం లో తీసుకురావడాన్ని గోల్డెన్ అవర్‌గా భావిస్తాం. ఆ సమయంలో పైలెట్ అప్రమత్తంగా లేకపోతే భారీ మూ ల్యం చెల్లించుకోవాల్సి వస్తది. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాల రక్షణకు కృషి చేస్తున్నాం.
నాగార్జున, పైలెట్ ( కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా)
పైలెట్ సేవలు కీలకం
108 వాహన సేవల్లో పైలెట్ సేవలు చాల కీలకం. ఈఎంటీతో సమానంగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అంబులెన్స్ నిర్వహణతో పా టు అప్రతమత్తంగా వాహనం నడపాల్సి ఉంటుంది. ప్రతి రోజూ వందలాది కేసులను సకాలంలో దవాఖానకు చేరుస్తున్నాం. బాధితులకు మెరుగైన వైద్యం అంది చిరునవ్వుతో ఇంటిబాట పడుతున్నారు. 108 పైలెట్ సేవలకు గుర్తింపుగా యేటా ఈ రోజును పైలెట్స్ డేగా జరుపుకోవడం సంతోషంగా ఉంది.
-సామ్రాట్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్