రామగిరి, మే 24 : ఒకపక్క సింగరేణి కార్మికులు ఛీ కొడుతున్నా జాతీయ సంఘాలు గనులపైకి వచ్చి మళ్లీ కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని టీబీజీకేఎస్ ఆర్జీ-3 ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య అన్నారు. అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో మంగళవారం కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జాతీయ సంఘాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు వారసత్వ ఉద్యోగాలను పోగొట్టి జాతీయ సంఘాల నాయకులు ఆత్మ సంతృప్తి చెందింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు అనగానే గనుల మీదకు వస్తున్న వారు ఇంతకాలం ఎక్కడ తల దాచుకున్నారని మండిపడ్డారు. టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా వచ్చిన వెంటనే గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేల విజ్ఞప్తితో సీఎం కేసీఆర్ స్పందించి కార్మికులు దిగిపోయాక మళ్లీ వారి పిల్లలు డ్యూటీలు చేయాలన్న ఉద్దేశంతో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించారని, వాటిని జీర్ణించుకోలేని జాతీయ సంఘాలు మళ్లీ కోర్టుకు వెళ్లి అడ్డుకునేందుకు నానా తంటాలు పడ్డాయని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ పట్టు వదలకుండా కారుణ్య పథకం ద్వారా కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు. కార్మికులకు రూ.10 లక్షలు వడ్డీ లేని రుణం, క్వార్టర్లకు ఏసీ వసతి, కార్పొరేట్ వైద్యం, రిటైర్మెంట్ వయసు పెంపు.. ఇలా చెప్పుకుంటూ పోతే టీబీజీకేఎస్ హయాంలో కోలిండియాలో లేనివిధంగా సింగరేణిలో అమలు చేయిస్తున్నదన్నారు. ఇప్పటికైనా జాతీయ సంఘాలు తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. నాయకులు శ్రీనివాస్, సత్యనారాయణ రెడ్డి, పూసాల శేఖర్, గట్ట శ్రీనివాస్, తిరుపతి, బడికెల రాజనర్సు, జనగాం కొంరయ్య, రమేశ్, సతీశ్ రెడ్డి, రాజిరెడ్డి, శ్రీకాంత్, వినయ్, కిశోర్‌బాబు ఉన్నారు.