నిర్మల్ టౌన్, మే 10 : సమష్టిగా పనిచేసి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ కే విజయలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ హాలులో మంగళవారం జడ్పీ స్థాయీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వివిధ స్థాయీ సంఘాల సమావేశాలు ఏర్పాటు చేశారు. అధికారులు ఆయా శాఖల అభివృద్ధి కార్యక్రమాలను స్థాయీ సంఘం ముందుకు తీసుకొచ్చారు. ముందుగా గ్రామీణాభివృద్ధి, ఆ తర్వాత వ్యవసాయం, విద్య- వైద్యం, మహిళా సంక్షేమం, సాంఘిక సంక్షేమం, పౌరస్థాయి, ప్రణాళిక, ఆర్థిక సంఘం స్థాయీ సంఘాల సమావేశం ఆయా కమిటీ చైర్మన్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. సభ్యులు పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించాలని కోరారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సహకారంతో అన్ని మండలాల్లో ప్రభుత్వ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బాశెట్టి సాగరాబాయి, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, స్థాయి సంఘాల చైర్మన్లు, సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.