ఎదులాపురం, మే 7 : 2022-23 విద్యా సంవత్సరంలో గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశం కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్,నిర్మల్ జిల్లాల్లో మొత్తం 14,795 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే ఉమ్మడి మూడు జిల్లాల్లో 27 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో 8 కేంద్రాల్లో 2,411 మంది, ఆసిఫాబాద్ జిల్లాలో 8 కేంద్రాల్లో 2,539 మంది, మంచిర్యాల జిల్లాలో 11 కేంద్రాల్లో 3,811 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
ఒక సీటుకు ఆరుగురు విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా ఎస్సీ గురుకులం ఆర్సీవో కొప్పుల స్వరూపారాణి మాట్లాడుతూ.. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు నంబర్‌తో పాటు హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకొని రావాలని సూచించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవచ్చని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. మొత్తం 27 పరీక్షా కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను కేటాయించామన్నారు. వేసవి దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు.
నిర్మల్ జిల్లాలో 16 పరీక్షా కేంద్రాలు
నిర్మల్ అర్బన్, మే 7 : నిర్మల్ జిల్లాలో గురుకుల పాఠశాలలో ఐదో తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్షకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం13 గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశం కోసం రాష్ట్ర విద్యాశాఖ పరీక్షను నిర్వహిస్తున్నది.
జిల్లాలో ఐదు సాంఘిక సంక్షేమ పాఠశాలలు, ఒక ట్రైబల్ వెల్ఫేర్, ఆరు బీసీ వెల్ఫేర్, ఒక సాధారణ గురుకుల పాఠశాలలుండగా, మొత్తం 960 ఖాళీలున్నాయి. ఒక్కో గురుకులంలో ఈ ప్రవేశ పరీక్ష ద్వారా మొత్తం 80 సీట్లు భర్తీ చేయనున్నారు. ఐదో తరగతి ప్రవేశం కోసం జిల్లా నుంచి 5,968 మంది విధ్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వీరికోసం మొత్తం 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.