హాజీపూర్, మే 7 : కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు వరిధాన్యాన్ని కొనాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. శనివారం మంచిర్యాల కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుతో కలిసి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లు, లారీ కాంట్రాక్టర్లతో వడ్ల సేకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల నుంచి నాణ్యమైన ధాన్యాన్ని కొనాలని, కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లలో నమోదు చేయాలన్నారు. గన్నీ సంచుల కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. తాగునీరు, నీడ సౌకర్యం కల్పించడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్‌కుమార్, రైస్ మిల్లర్లు సంఘం అధ్యక్షుడు నల్మాస్ కాంతయ్య, డీసీఎంఎస్ చైర్మెన్ లింగన్న, రైస్‌మిల్లర్లు, లారీ కాంట్రాక్టర్లతో పాటు సంబంధిత శాఖల అధికారులు, తదితరులున్నారు.
అంగన్వాడీ కేంద్రాలకు సకాలంలో బియ్యం సరఫరా చేయాలి
జిల్లాలోని 7 మున్సిపాలిటీల పరిధిలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు సకాలంలో బియ్యం చేరవేసేందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. జిల్లా సంక్షేమాధికారి ఉమాదేవితో కలిసి మున్సిపల్ కమిషనర్లతో కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలో 83 అంగన్వాడీ కేంద్రాలు, మందమర్రి పరిధిలో 61, నస్పూర్ పరిధిలో 21, క్యాతన్‌పల్లి పరిధిలో 21, బెల్లంపల్లి పరిధిలో 54, లక్షెట్టిపేట పరిధిలో 17, చెన్నూర్ పరిధిలో 25 అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం పంపిణీకి ఒక్కో బ్యాగ్‌కు 25 రూపాయల చొప్పున చెల్లిస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో సంబంధిత మున్సిపల్ కమిషనర్లతో పాటు ఆయా శాఖల అధికారులు తదితరులున్నారు.
బ్యాడ్మింటన్ సమ్మర్ క్యాంప్ ప్రారంభం
మంచిర్యాల అర్బన్, మే 7 : విద్యార్థులు, క్రీడాకారులు సమ్మర్ హాలీడేస్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. శని వారం హైటెక్ సిటీలో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ సమ్మర్ క్యాంపును డీవైఎస్వో శ్రీకాంత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బ్యాడ్మింటన్ సంఘం మాజీ కార్యదర్శి తోట శంకరయ్య కుటుంబ సభ్యులకు రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో మంజూరు చేసిన లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేశ్ గౌడ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ సుధాకర్, ఉపాధ్యక్షుడు వాసు, రమేశ్ రెడ్డి, సత్యపాల్ రెడ్డి, రాజలింగు, కృష్ణ, కోచ్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.