ఆదిలాబాద్, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పోలీసు ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గతంలోనే జిల్లాలవారీగా ఆయా విభాగాల్లో ఖాళీ పోస్టుల వివరాలు సేకరించి పోలీసు యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. ఆ మేరకు సోమవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. న్యాయపరంగా చిక్కులు రాకుండా చూసుకొని నోటిఫికేషన్లు జారీ చేసిందని నిపుణులు చెబుతున్నారు. కాగా.. భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేయడం ఇదే మొదటిసారని అభిప్రాయపడుతున్నారు.
సర్వత్రా హర్షం
పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురుచూసిన అభ్యర్థులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఆయా నిరుద్యోగ అభ్యర్థుల అంచనాలకు అందనంత భారీ మొత్తంలో ఖాళీల భర్తీకి పూనుకుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌తోపాటు విధి విధానాలు జారీ చేసింది. నిజానికి పోలీసు విభాగాల్లో ఖాళీలు భర్తీచేస్తారన్న నమ్మకంతో ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ మొత్తంలో నోటిఫికేషన్లు రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. తమ స్వప్నం నేరవేర్చుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించారని యువత సంబుర పడుతున్నది.
కల సాకారమయ్యే వేళ..
పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న 16,614 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎస్సై ఉద్యోగం మొదలుకొని డ్రైవర్ వరకు ఖాళీలను భర్తీ చేయనున్నారు. 414 ఎస్సై పోస్టులు, 4,965 సివిల్ కానిస్టేబుళ్లు, 4,423 ఏఆర్ కానిస్టేబుళ్లు, టీఎస్ఎస్పీ బెటాలియన్‌లో 5,010 కానిస్టేబుళ్లు, స్పెషల్ పోలీస్ ఫోర్స్‌లో 90, ఫైర్‌లో 610, డ్రైవర్ పోస్టులు 100 భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల నియామకంలో భాగంగా మే 2 నుంచి 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఖాకీ డ్రెస్ వేసుకోవాలని లక్ష్యంగా ఎంచుకున్న యువతీ యువకులు ఇప్పటికే పోలీసు ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు. ఆదిలాబాద్ పోలీసు శిక్షణ కేంద్రంలో 250 మందికి, ఇచ్చోడలో 140 మందికి, ఉట్నూర్‌లో 200 మంది గిరిజన యువత శిక్షణ పొందుతున్నారు.
సీఎం కేఆర్‌కు ధన్యవాదాలు..
నిరుద్యోగులకు ఉచితంగా అందిస్తున్న శిక్షణ బాగుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు బోధిస్తుండడంతో తెలంగాణ చరిత్ర, ఉద్యమం, అస్తిత్వానికి సంబంధించి చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఎస్సీ స్డడీ సర్కిల్లో 5 నెలల ఫౌండేషన్ కోర్సు ద్వారా ప్రిపేర్ అవుతున్నా. అన్ని సబ్జెక్టులు అర్థమయ్యేలా ఈజీ టిప్స్ చెబుతుండడంతో లెక్కలు సులువయ్యాయి. అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నా. ప్రభుత్వం నోటిఫికేషన్ వేసినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.
– స్వరూప, నిర్మల్‌జిల్లా
చాలా ఉపయోగపడుతుంది..
నేను కానిస్టేబుల్ ఉద్యోగానికి సిద్ధమవుతున్నా. హైదరాబాద్‌కు వెళ్లి ప్రైవేట్‌గా కోచింగ్ తీసుకునే స్థోమత లేదు. నా లాంటి వారికి ఎస్సీ స్టడీ సర్కిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మొన్న ఇక్కడే అర్హతగల అభ్యర్థులపే శిక్షణ కోసం ఎంపికచేశారు. ఇక్కడ కార్పొరేట్ స్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. ఎలాంటి సందేహాలున్నా ఎప్పటికప్పుడు తీరుస్తున్నారు. మూడు నెలల పాటు శిక్షణ తీసుకుంటూ ఇక్కడే ఉంటా. ప్రభుత్వం నోటిఫికేషన్ రావడం సంతోషంగా ఉంది.
– లక్ష్మీకాంత్, నార్నూర్, ఆదిలాబాద్