తలమడుగు, ఏప్రిల్ 18: మండలంలోని పలు గ్రామాల్లో మట్టి రోడ్లు సీసీ రోడ్లుగా మారతున్నాయి. ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లోని అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా మారుస్తున్నారు. దెబ్బతిన్న మట్టి రోడ్లతో ఇబ్బందులు పడిన పల్లె వాసులు సీసీ రోడ్లను చూస్తూ సంతోషపడుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో అంతర్గత రోడ్లు ఎక్కువ శాతం మట్టితోనే ఉన్నాయి. కొన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నా పూర్తి స్థాయిలో నిధులు మంజూరు కాక నామమాత్రంగా పనులు జరిగేవి. అంతర్గత వీధులు చిన్నగా ఉండడం, అవి మట్టి రోడ్లతో ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు దాదాపు దూరమవుతున్నాయి. గ్రామాల్లో ప్రధాన రోడ్లు ఇప్పటికే సీసీ రోడ్లుగా మారాయి. మిగిలిన రోడ్లకు ఉపాధి హామీ నిధులు కేటాయిస్తుండడంతో పనులు చకచకా జరుగుతున్నాయి. మండలంలోని 28 పంచాయతీల్లో సీసీ రోడ్లు వేసేందుకు ఉపాధి హామీ నుంచి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ప్రతిపాదనలతో 79 పనులను గుర్తించి రూ.2 కోట్లు మంజూరు చేశారు.
అభివృద్ధి వైపు అడుగులు
గ్రామాల్లో అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా నిర్మించేందుకు ఉపాధి హామీ నిధులు కేటాయించడం సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ చొరవతో నిధులు మంజూరయ్యాయి. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేయడంతో ప్రజల ఇబ్బందులు దూరమవుతున్నాయి. గ్రామంలో రూ.25 లక్షలతో సీసీ రోడ్లు వేశాం.
-మోట్టే వెంకటమ్మ, సర్పంచ్, కజ్జర్ల
గ్రామస్తుల సౌకర్యార్థం..
గ్రామాల్లోని మట్టి రోడ్లు వర్షాకాలంలో బురదగా మారుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. పల్లె ప్రజల సౌకర్యార్థం మట్టి రోడ్లను సీసీ రోడ్లుగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. గ్రామంలో రూ.13 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించాం.
-మోహితే ప్రభ, సర్పంచ్, కుచులాపూర్