పన్నెండేళ్ల పర్వం.. ప్రాణహిత పుష్కరం.. పరమ పవిత్రం.. మానవాళికి మహాద్భాగ్యం..శరీరశుద్ధికి సౌభాగ్య మంత్రం.. భక్తికి, ముక్తికి దోహదం.. విశ్వాసానికి ప్రతిరూపం.. పవిత్ర ప్రాణహితం.. ప్రాణికోటికి జీవధార.. అడుగడుగునా ఆధ్యాత్మిక ఝరి.. నదిలో పుష్కరుడు కొలువైన ఈ పన్నెండు రోజులు భక్తకోటి పరవశించి పోతుంది. పుష్కర స్నానంతో పాపాలన్ని తొలగి పుణ్యఫలం సిద్ధిస్తుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.
మంచిర్యాల/కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/కోటపల్లి, ఏప్రిల్ 12;గోదావరి నదికి ప్రధాన ఉపనది, జీవనది అయిన ప్రాణహిత పుష్కర వేడుకలకు ముస్తాబైంది. చైత్రశుద్ధ ద్వాదశి ఏప్రిల్ 13 బుధవారం ఉదయం నుంచి చైత్రశుద్ధ బహుళ అష్టమి ఏప్రిల్ 24 వరకు అంటే 12 రోజులపాటు పుష్కరాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నేటి(బుధవారం) మధ్యాహ్నం 3.50 గంటలకు దేవగురు బృహస్పతి మీనరాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ప్రాణహిత నదికి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. అర్జునగుట్ట సమీపంలోని ప్రాణహిత పుష్కరాల ప్రారంభానికి అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ రానున్నారు. మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అధికారులతో సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు.
ఒక్కో నదికి ఒక్కో ఏడాది..
కాలగమనంలో నవగ్రహాలు తమ కాలపరిమితికి లోబడి వివిధ రాశుల్లో ప్రయాణిస్తుంటాయని ఖగోళ శాస్త్రజ్ఞులు, పంచాంగకర్తల గణాంకాలు చెబుతుంటాయి. ఈ నేపథ్యంలో 12 నెలల(ఒక్కో సంవత్సరం)పాటు ఒక్కో రాశిలో తిరిగే బృహస్పతి (గురువు) ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరిణిగా, దేశంలోని 12 నదులకు ఒక క్రమ పద్ధతిని పురాతన శాస్త్రజ్ఞులు రూపొందించారు. ఇందులో భాగంగా గురువు మేషరాశిలో ప్రవేశిస్తే గంగా(భాగీరథీ) నదికి, వృషభ రాశిలో నర్మదా నదికి, మిథునంలో సరస్వతీ నదికి, కర్కాటకంలో యమునా నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరి నదికి, కన్యలో కృష్ణానదికి, తులలో కావేరి నదికి, వృశ్చికంలో తామ్రపర్ణీ నదికి పుష్కరాలుగా భావిస్తారు. గురువు ధనస్సులో ప్రవేశిస్తే సింధూ నదికి, మకరంలో తుంగభద్ర నదికి, కుంభంలో ప్రవేశిస్తే భీమరథీ నదికి, మీనంలో గురువు వచ్చినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తాయి.
సర్వం సిద్ధం
మంచిర్యాల జిల్లా కోటపల్లి, వేమనపల్లి.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహట్టి పుష్కరఘాట్ల వద్ద ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అర్జునగుట్ట ప్రాణహిత పుష్కరఘాట్ జాతీయ రహదారి నంబర్ 63కు ఆనుకొని ఉండడం, చెన్నూర్‌కు సమీపంలో, మంచిర్యాల వరకు రైలు మార్గం ఉండడంతో ఈ పుష్కర ఘాట్‌కు 2010 సంవత్సరంలో జరిగిన పుష్కరాల కంటే భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. గడువు సమీపిస్తుండడంతో తాగు నీరు, నీడ కోసం, బట్టలు మార్చుకునేందుకు, మరుగుదొడ్ల నిర్మాణం, తాత్కాలిక రహదారులు, పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్‌తోపాటు పలు శాఖల అధికారులు పుష్కరాల కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేశారు. గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచారు.
ప్రాణహిత ప్రాశస్త్యం..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహట్టి వద్ద పుట్టిన ప్రాణహిత నది రాష్ట్రంలో సుమారు 113 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నది. మహారాష్ట్రలో పుట్టిన వార్దా, పెన్‌గంగా నదుల సంగమంతో జీవనదిగా విరాజిల్లుతున్నది. కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసి త్రివేణి సంగమంగా ప్రత్యేకతను సంతరించుకున్నది. అవతలివైపు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సరిహద్దుగా ఉంది. గోదావరి నదికి ప్రధాన ఉపనదిగా ఉన్న ప్రాణహిత గోదావరి బేసిన్లో 40 శాతం నదీజలాల వాటా కలిగి ఉంది. ఇంతటి ప్రాచుర్యం గల ప్రాణహిత పుష్కరాలకు చారిత్రక ప్రాధాన్యం ఉంది. నదీతీరంలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. పుష్కరాలు నిర్వహించే 12 నదుల్లో ఒక్కటైన ప్రాణహిత ప్రత్యేకతను కలిగి ఉంది. ప్రణీత మహాముని ఇక్కడ తపస్సు చేయడంతో ఈ నదికి ఆయన పేరు కలిసేలా ప్రాణహితగా స్థిరపడిందని ప్రతీక. నదీతీరంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ప్రాణులతో ఈ పేరు వచ్చిందని మరో ప్రశస్తి కూడా ఉంది.
ప్రత్యేక బస్సులు
ప్రాణహిత పుష్కరాల సందర్భంగా 13 నుంచి 24 వరకు మంచిర్యాల ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. మంచిర్యాల, చెన్నూర్ నుంచి అర్జునగుట్ట, సిరోంచ వరకు బస్సులు నడుస్తాయి. మంచిర్యాల నుంచి అర్జునగుట్ట, సిరోంచ వరకు రూ.120, చెన్నూరు నుంచి అర్జునగుట్ట, సిరోంచకు రూ.55 బస్సు చార్జీలు వసూలు ఉంటాయి. అలాగే మంచిర్యాల, చెన్నూరు నుంచి కాళేశ్వరం వరకు అదనపు బస్సులు నడువనున్నాయి. ఆసిఫాబాద్ డిపోకు చెందిన నాలుగు బస్సులను కౌటాల నుంచి తుమ్మిడిహట్టి వరకు ప్రత్యేకంగా నడుపుతున్నారు. బస్సు చార్జి రూ.40లు ఉండనుంది. హైదరాబాద్ నుంచి కౌటాల వరకు రోజు రాత్రి 7.30 గంటలకు ప్రత్యేకంగా సూపర్ లగ్జరీ నడుపుతున్నట్లు తెలిపారు. 30 మంది ప్రయాణికులకు ఒకే చోట నుంచి పుష్కరాలకు వెళ్లదలచి నట్టయితే వారి కోసం ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.