చెన్నూర్, ఏప్రిల్ 12: చెన్నూర్ రైతాంగం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎత్తిపోతల పథకం కల త్వరలో నెరవేరబోతున్నది. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో దాదాపు 90,000 ఎకరాలకు సాగు నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టు చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో మంగళవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ పథకం నిర్మాణానికి రూ 1,658కోట్ల మంజూరు చేస్తూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నియోజకవర్గం చుట్టూ గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగాంగా గోదావరి నదిపై మేడి గడ్డ (లక్ష్మీ బారేజ్), అన్నారం (సరస్వతీ బారేజ్), సుందిళ్ల ( పార్వతీ బారేజ్)ను నిర్వహించారు. దీంతో మూడు కాలాల పాటు గోదావరి, ప్రాణహిత నదులు నిండు కుండలా ఉంటున్నాయి.
దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి, ప్రా ణహిత నదులపై మూడు ఎత్తిపోతల పథకాలను నిర్మించి చెన్నూర్ నియోజకవర్గంలోని లక్ష పైచిలుకు ఎకరాలకు సాగు నీరు అందించాలని ప్రభు త్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ నిర్ణయించారు. ఇందు కోసం సీఎం కేసీఆర్‌ను కలసి నియోజకవర్గ రైతాంగం కోసం ఎత్తిపోతల పథకం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పలు మార్లు శాసన సభ సమావేశాల్లో కూడా ఎత్తి పోతల పథకం గురించి వివరించి ప్రభుత్వం దృష్టికి తీసుక వచ్చారు. దీంతో ఈ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మొదటగా సర్వే కోసం ఆమోదం తెలిపి రూ 8.88కోట్లు మంజూరు చేశారు. దీంతో ఎత్తిపోతల పథకం సర్వే పనులను 2020 జూన్ 1న ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రారంభించారు.
సర్వే పనులు జరుగుతుండగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అనేమార్లు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. సర్వే పనులు వేగ వతంగా జరిగే విధంగా, నిర్దేశించిన గడువులోగా పూర్తయ్యే విధంగా అధికారులను ఆదేశించారు. గడువు లోపల సర్వే పూర్తి కాగా, సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు ఎత్తి పోతల పథకానికి సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)నుప్రభుత్వానికి అందించారు. దీంతో మరోసారి సీఎం కేసీఆర్‌ను కలిసిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎత్తిపోత పథకానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో మంత్రి మండలి చెన్నూర్ ఎత్తిపోతల పథకాల పథకానికి ఆమోదం తెలిపి రూ 1,658కోట్లను మంజూరు చేసింది. గోదావరి నదిపై రెండు, ప్రాణహిత నదిపై ఒక్కటి మొత్తం మూడు ఎత్తిపోతల పథకాలను నిర్మించి ఐదు మండలాల్లోని 103 గ్రామాలు, 3 మున్సిపాలిటీలకు సాగు, తాగు నీరు అందించనున్నారు.
ఇందు కోసం దాదాపు 10 టీఎంసీల గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఈ పథకానికి వినియోగించనున్నారు. ప్రాణహిత నదిపై కోటపల్లి మండలంలోని ఆల్గాం గ్రామం వద్ద మేడిగడ్డ (లక్ష్మి) బారేజ్ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి కోటపల్లి మండలంలోని 16,370ఎకరాలు, చెన్నూర్ మండలంలోని నర్సక్కపేట వద్ద అన్నారం (సరస్వతీ ) బారేజ్పై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి చెన్నూర్, భీమారం, కోటపల్లి మండలాల్లోని 48,208 ఎకరాలు, జైపూర్ మండలంలోని టేకుమట్ల వద్ద సుందిళ్ల (పార్వతి) బారేజ్పై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి జైపూర్, మందమర్రి మండలాల్లోని 25,423 ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను స్వయంగా కలిసి ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ కృతజ్ఞతలు తెలిపారు.
త్వరలోనే పనుల ప్రారంభిస్తాం
నియోజకవర్గంలో సాగు, తాగు నీరు అందించేందుకు నిర్మించే చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపి రూ 1,658కోట్లు మంజూరు చేయడం చాల సంతోషంగా ఉంది. చెన్నూర్ నియోజకవర్గ రైతాంగం ప్రయోజనాల కోసం నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఇంజినీరింగ్ అధికారులు నిర్దేశించిన గడువు లోగా సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి డీపీఆర్ అందజేశారు. దీంతోనే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఎత్తిపోతల పనులు ప్రారంభించి, సకాలంలో పూర్తి చేస్తాం. ఈ నిర్ణయంతో చిన్న, సన్నకారు రైతుల గుండెల్లో సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారు. త్వరలోనే ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం.
–బాల్క సుమన్ (ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే)