భైంసా, ఫిబ్రవరి 26 : రూ.25 లక్షల విలువైన బంగారాన్ని రూ.10 లక్షలకే ఇస్తామని మోసం చేసిన అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు నిర్మల్ ఏఎస్పీ కిరణ్ ఖారే తెలిపారు. ఈ మేరకు శనివారం డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని యా వత్మాల్కు చెందిన రవీంద్ర మహాదేవ్ కాట్రె, మతీన్, సలీం సాగ్వాన్ గ్యాంగ్ తమ వద్ద దొరికిన బంగారం ఉన్నదని, తక్కువ ధరకే ఇస్తామని మధ్యవర్తుల ద్వారా నమ్మించి మోసం చేస్తున్నదన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన నగల వ్యాపారి కల్యాణ్‌కుమార్‌ను మోసం చేసినట్లు చెప్పారు. ముందు గా తానూర్ మండలం బెంబర్ గ్రామానికి చెం దిన మధ్యవర్తులు లవాడే బాబు, జాదవ్ బాలాజీ ద్వారా రూ.25 లక్షల విలువైన బం గారం రూ.10 లక్షలకే ఇప్పిస్తామని కల్యాణ్‌కుమార్‌ను నమ్మించారని తెలిపారు. ముందుగా 2 గ్రాముల అసలైన బంగారం తెచ్చి చూపించగా, నమ్మిన కల్యాణ్‌కుమార్ రూ.లక్ష అడ్వాన్స్ కూడా చెల్లించాడని తెలిపారు. మిగిలిన మొత్తం చెల్లించి, బంగారం కొనేందుకు బాలాజీ, లవాడే బాబుతో కలిసి యావత్మాల్కు వెళ్లినట్లు చెప్పారు. అక్కడ రవీంద్ర కాట్రే, మతీన్, సలీం సాగ్వాన్‌ను కలువగా, వారు బంగారుపూత పూసిన ఇనుపకడ్డీని ఇచ్చారని తెలిపారు. అనుమానం వచ్చిన కల్యాణ్ పరిశీలించగా, ఇనుపకడ్డీ అని తేలిందని చెప్పారు. బాధితుడు భైంసాటౌన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బాబు, బాలాజీ పటేల్‌ను అరెస్టు చేసినట్లు వివరించారు. మరో ఇద్దరు సలీం, మతీన్ పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని ఏఎస్పీ చెప్పారు. వీరి వద్ద నుంచి రూ.2 లక్షల బంగారంతో పాటు రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. మిగితా రూ.6 లక్షలు రికవరీ చేయాల్సి ఉందన్నారు. ఈ కేసు ఛేదించిన సిబ్బందికి రివార్డులు అందజేశారు. ఇందులో ఎస్ఐ మాలిక్, సిబ్బంది నాగభూషణ్ గంగాధర్ ఉన్నారు.