ఎదులాపురం,ఫ్రిబవరి25: వివిధ పథకాల కింద మంజూరైన యూనిట్లను వెంటనే గ్రౌండింగ్ చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ బ్యాంకర్లకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంటలు, మహిళా సంఘాల రుణాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల యూనిట్ల గ్రౌండింగ్ వెంటనే చేయాలన్నారు. త్వరలో ఆర్థిక సంవత్సరం ముగియనున్న దృష్ట్యా లబ్ధిదారులకు మంజూరైన రుణాలు వెంటనే అందించాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల కింద రూ.3864.83 కోట్ల మంజూరు చేయాలనే లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.1792.97 కోట్లు మంజూరు చేశామన్నారు. ఇందులో రూ.1988.63 కోట్ల పంట రుణాలకు గాను రూ.1208.62 కోట్లు అందించామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 9217 మహిళా సంఘాలకు రూ.194.47 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు లక్ష్యం కాగా ఇప్పటివరకు 4908 సంఘాలకు రూ.169.91 కోట్లు అందించామని వెల్లడించారు. స్థానిక అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. రుణాల మంజూరుకు ఆయాశాఖల అధికారులు బ్యాంకర్లతో సమన్వయం చేయకోవాలని, లక్ష్యానికి అనుగుణంగా యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని సూచించారు. మహిళా సంఘాల నుంచి రుణాలు వసూలు చేయాలన్నారు. ఐటీడీఏ పీవో అంకిత్ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లోని వ్యవసాయదారులకు పంట రుణాలు , లబ్ధిదారులకు మంజూరైన యూనిట్లను వెంటనే గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్బీఐ ఎల్డీవో తేజ్దీప్త బెహరాజ్, నాబార్డ్ డీడీఎం తేజ్ నవనీత్ రెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్, డీఆర్డీఏ కిషన్, బ్యాంక్ కంట్రోలింగ్ అధికారులు, మేనేజర్లు, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రీమెటిక్, పోస్ట్మెట్రిక్ ఉపకారవేతనాల ప్రతిపాదనలను శనివారంలోగా జిల్లా కార్యాలయానికి అందించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు పెండింగ్లో ఉన్న ఉపకారవేతనాల మంజూరుకు శుక్రవారం డీఎస్డీవో, డీఈవో, ఎంఈవోలు, డీఐఈవో, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, హెచ్ఎంలతో వర్చువల్ విధానం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపకారవేతనాల రిజిస్ట్ట్రేషన్ వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్డీవో భగత్ సునీత, డీఈవో ప్రణీత, డీఐఈవో రవీందర్, ఏఈవోలు, ప్రిన్సిపాళ్లు ఉన్నారు.