 
                                                            ఆదిలాబాద్ ఏప్రిల్ 2 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఉగాది వేడుకలు వైభవంగా సాగాయి. కొత్త తెలుగు సంవత్సరాది శుభకృత్‌కు ఘన స్వాగతం పలికారు. శనివారం వేకువజామునే ఆలయాల్లో భక్తులు పూజలు చేయగా.. వేదపండితులు పంచాంగ శ్రవణం చేశారు. ఆలయాలు, గనులపై ప్రముఖులు ఉగాది పచ్చడిని పంపిణీ చేయగా.. బంధువులు, సన్నిహితులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. పశువులను శుభ్రంగా కడిగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యం వండి దైవాలకు సమర్పించారు. ఇంటిల్లిపాది సహపంక్తి భోజనం చేశారు.
ఇచ్చోడ, సిరికొండలో.. 
ఇచ్చోడ/సిరికొండ/గుడిహత్నూర్/తాంసి/జైనథ్, ఏప్రిల్ 2: మండలాల్లోని గ్రామాల్లో శనివారం తొలి సంవత్సరాది ఉగాది ఘనంగా నిర్వహించారు. శుభకృత్ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రజలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. రైతులు ఉదయాన్ని పంటపొలాలకు వెళ్లి నేల తల్లికి పూజలు చేసి సాగు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది పాడిపంటలు బాగా ఉండాలని వేడుకున్నారు.
బజార్హత్నూర్లో..
బజార్హత్నూర్, ఏప్రిల్ 2 : మండల కేంద్రంతో పాటు జాతర్ల, పిప్పిరి, గిర్నూర్ గ్రామాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రైతులు నూతన వస్ర్తాలను ధరించి ఉదయం తమ చేనులోకి వెళ్లి భూమాతకు పూజలు చేసి తొలిదుక్కిదున్నారు. సాయంత్రం ఆలయాల్లో పంచాంగ శ్రావణం నిర్వహించారు.
నార్నూర్, ఇంద్రవెల్లి మండలంలో..
నార్నూర్/ ఇంద్రవెల్లి, ఏప్రిల్ 2 : గిరిజన గ్రామాల్లో ఆదివాసులు తమ సంప్రదాయ ప్రకారం ఇంటి దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేసి వ్యవసాయ పనులు ప్రారంభించారు. జొన్న, మక్క, కంది, శనగ ధాన్యాలతో చేసిన గుడాలను పశువులకు నైవేద్యంగా తినిపించారు. గ్రామ పటేల్ ఇంటి ఆవరణలో మామిడి ఆకులతో విస్తరాకులు తయారు చేసి అందులోనే గుడాలు తిన్నారు.
ఉగాది పచ్చడి పంపిణీ
ఉట్నూర్‌రూరల్, ఏప్రిల్ 2 : మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్, మానస దంపతులు భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు సంతోష్ దూబే, వైస్‌ఎంపీపీ దావులే బాలాజీ, లింగోజితండా సర్పంచ్ హరినాయక్, సీనియర్ నాయకుడు దాసండ్ల ప్రభాకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, నాయకులు తన్నీరు సతీశ్, క్రాంతి, నికేశ్ పాల్గొన్నారు.
తలమడుగు మండలంలో..
తలమడుగు, ఏప్రిల్ 2 : మండల కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
బేలలో..
బేల, ఏప్రిల్ 2: మండల వ్యాప్తంగా రైతులు తమ వ్యవసాయ పనిముట్లకు పూజలు చేశారు. పొలాలలో పనులను ప్రారంభించారు. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిని ప్రజలు ఆరగించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ వనిత ఠాక్రే, జడ్పీటీసీ అక్షిత పవార్, నాయకులు గంభీర్ ఠాక్రే, సతీశ్ పవార్, వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, ప్రమోద్ రెడ్డి, మస్కే తేజ్రావ్, దేవన్న పాల్గొన్నారు.
బోథ్‌లో..
బోథ్, ఏప్రిల్ 2: బోథ్, సొనాల, కౌఠ(బీ), ధన్నూర్(బీ), పొచ్చెర, మర్లపెల్లి, పట్నాపూర్, కుచులాపూర్, కన్గుట్ట గ్రామాల్లో రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. తెల్లవారు జామునే పొలాలకు వెళ్లి ఆరుకున్నారు. ఆలయాల్లో వేద పండితులు పంచాంగ శ్రవణం గావించారు. మధ్యాహ్నం అన్నదాతలు పొలాల్లోని పందిల్ల వద్ద గుడాలు వండి పంచిపెట్టారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ తన వ్యవసాయ క్షేత్రంలో పూజలు చేశారు.
నేరడిగొండ, మార్చి 2 : తేజాపూర్ గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడిని తయారు చేసి పంచిపెట్టారు. సాయంత్రం వేదపండితుడు శ్రావణ్‌కుమార్ పంచాంగ శ్రవణం చదివి వినిపించారు. కుమారి గ్రామంలోని శివాలయంలో భక్తులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
 
                            