సారంగాపూర్, ఫిబ్రవరి 23 : తెలంగాణ సర్కారు సాగునీటి రంగాలకు పెద్దపీట వేస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో రూ.12.05 కోట్లతో చేపట్టనున్న దోనిగాం ప్రాజెక్టు నిర్మాణ పనులను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. దోనిగాం ప్రాజెక్టును 1976లో 1550 ఎకరాల ఆయకట్టు సామర్థ్యంతో మొదలు పెట్టడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు విడుదల చేసి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్, తూములు, డ్రాఫ్స్, గైడ్‌వాల్స్, లైనింగ్ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.
అభివృద్ధి పనులు ప్రారంభం
తాండ్ర(జీ) గ్రామంలో రూ.10లక్షల అంచనా వ్యయంతో భీమన్నగుడి నిర్మాణం, కంకెటలో సీసీ రోడ్డు పనులను మంత్రి అల్లోల ప్రారంభించారు. వైకుంఠపూర్లో శివాలయం పనులను పరిశీలించారు. అనంతరం సారంగాపూర్ రైతువేదికలో 36మంది లబ్ధిదారులకు కల్యాణిలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లావెంకట్రాంరెడ్డి, జడ్పీటీసీ రాజేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, టీఆర్ఎస్ మండలకన్వీనర్ మాధవరావు, డీసీసీబీ డైరెక్టర్ ఐర నారాయణరెడ్డి, ఆలూర్ సొసైటీ చైర్మన్ మాణిక్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ మధుకర్‌రెడ్డి, ఆర్డీవో రమేశ్ రాథోడ్, ఇరిగేషన్ ఎస్ఈ సుశీల్‌కుమార్ దేశ్‌పాండే, ఈఈ రామారావు, తహసీల్దార్ సంతోష్‌రెడ్డి, ఎంపీడీవో సరోజ, డీఈ అనిల్, జేఈ మధుపాల్ పాల్గొన్నారు.
బాధితులకు సత్వర న్యాయం
నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 23 : పోక్సో కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించి నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపడుతామని న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాకు పోక్సో కోర్టు మంజూరైన నేపథ్యంలో తాత్కాలిక భవనం కోసం బుధవారం కోర్టు ఆవరణలోని భవనంతోపాటు, పీజీ కళాశాలను ఆయన పరిశీలించారు. రెండేళ్లలో పోక్సో కోర్టుకు కొత్త భవనాన్ని నిర్మిస్తామన్నారు. మంత్రి వెంట బార్ అసోసియేషన్ సభ్యులు మల్లారెడ్డి, విశ్వాస్ రెడ్డి, న్యాయవాదులు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు ఉన్నారు.
చేనేత రంగానికి అండగా ఉంటాం
చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఎంఎస్ ఫంక్షన్హాల్లో కళాభారతి చేనేత హస్తకళా మేళాను ప్రారంభించారు. అనంతరం మంత్రిని ఘనంగా సన్మానించారు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్, నేరేళ్ల వేణు, ఛాహుస్, కళాభారతి అధ్యక్షుడు జెల్ల సత్యనారాయణ, కార్యదర్శి శనిగారం కిశోర్ ఉన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ఈ-ఆటోలు
నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 23 : పర్యావరణ పరిరక్షణకు ఈ-ఆటోలే మేలని రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంజూరైన నాలుగు ఆటోలను బుధవారం మంత్రి లబ్ధిదారులకు అందించారు. ఒక్కో ఆటో ధర రూ.3,22,910 కాగా.. 60 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, బీసీ సంక్షేమశాఖ అధికారి రాజలింగం, ఏవో కరీం, అధికారులు ఉన్నారు.