ఎదులాపురం, ఫిబ్రవరి 23 : ఆరోగ్య, పారిశుధ్య, పోషకాహార దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం జిల్లా వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి నివాసంలో నిర్వహించే పోషకాహార దినోత్సవంలో అంగన్వాడీ , ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎం, ఆరోగ్య సిబ్బంది పాల్గొనాలని సూచించారు. వివిధ ఆరోగ్య లోపాలతో జన్మించిన పిల్లలను, రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులను, పోషక ఆహార లోపంతో ఉన్న బాలబాలికలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి గురువారం పాఠశాలల్లో 10 నుంచి 15 ఏళ్ల పిల్లలకు ఐరన్ మాత్రలు అందజేయాలని ఆదేశించారు. ఇందుకు ప్రతి పాఠశాలలో సైన్స్ టీచర్లను నోడల్ అధికారులుగా నియమించాలన్నారు. అంగన్ వాడీ , ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎం, ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. మండల స్థాయి అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్, డీఈవోప్రణీత, జిల్లా సంక్షేమ శాఖ అధికారి మిల్కా, ఇమ్యునైజేషన్ అధికారి శ్రీకాంత్, అధికారులు పవన్ కుమార్, అనిల్ కుమార్ పాల్గొన్నారు.
ఎదులాపురం, ఫిబ్రవరి 23 : జిల్లాలోని పాఠశాలల్లో విద్యా బోధనకు అవసరమైన ఉపాధ్యాయులను నియమించడానికి ప్రతిపాదనలు పంపాలని కేంద్ర ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ కలెక్టర్లు, అధికారులకు సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి కేంద్ర ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించడానికి జిల్లా స్థాయి నుంచి ప్రతిపాదనలు కోరుతున్నామని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జాతీయ సాధన సర్వే సూచన ఆధారంగా జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థుల హాజరు పెంపుదల, ఉపాధ్యాయుల నియామకానికి ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీతను ఆదేశించారు. సమావేశంలో సమగ్ర శిక్ష డైరెక్టర్ రమేశ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ , సెక్టరియల్ అధికారి నర్సయ్య పాల్గొన్నారు.