ఆదిలాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జాతీయ రహదారులపై ప్రతి 60 కిలోమీటర్లకు ఒక టోల్‌ప్లాజా ఉండాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ ప్రకటనతో ప్రజలకు ఎటువంటి ప్రయోజనం చేకూరే అవకాశాలు కనిపించడం లేదు. ఆదిలాబాద్-నిర్మల్ జిల్లాల పరిధిలో ఎన్‌హెచ్-44పై మూడు టోల్‌ప్లాజాలు ఉండగా.. ఇందులో జైనథ్ మండలంలోని పిప్పర్వాడ టోల్‌ప్లాజాను ఎన్హెచ్ఏఐ అధికారులు ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని పాండ్రకవడ టోల్‌ప్లాజా నుంచి పిప్పర్వాడ టోల్‌ప్లాజా వరకు 35 కిలోమీటర్లు ఉండడమే ప్రధాన కారణం. నిబంధనల ప్రకారం ఒక చోట టోల్గేట్ ఎత్తివేసినా ఆ డబ్బులు మరో టోల్‌ప్లాజా వద్ద కట్టాల్సి ఉంటుందని ఎన్హెచ్ఏఐ అధికారులు పేర్కొంటున్నారు.
ఆదిలాబాద్-నిర్మల్ జిల్లాల పరిధిలో నేషనల్ హైవే-44 విసర్తించి ఉంది. నిర్మల్ జిల్లా సోన్ నుంచి ఆదిలాబాద్ జిల్లా డొల్లార వరకు దాదాపు 130 కిలోమీటర్ల మేర రహదారి ఉంది. ఉత్తరాది-దక్షిణాది రా ష్ర్టాలను కలిపే ఈ రోడ్డు గుండా నిత్యం వేలా ది వాహనాలు వెళ్తుంటాయి. సరుకుల రవాణాతోపాటు ప్రజలు అవసరాలరీత్యా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రెండు జిల్లాల పరిధిలో ఎన్‌హెచ్-44పై మూడు టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పిప్పర్వాడ, నేరడిగొండ మండలంలోని రోల్మామడ.. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గంజాల్ వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఇవీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. నిర్మించు, నిర్వహించు విధానం ద్వారా 25 ఏండ్లు ఈ రహదారి గుండా వెళ్లేవారి వద్ద టోల్‌ట్యాక్స్ వసూలు చేస్తారు. 2008 సంవత్సరంలో టోల్‌ప్లాజాలు ప్రారంభం కాగా.. దాదాపు 13 ఏండ్లకుపైగా నిర్వాహకులు డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. రహదారి దూరం, వంతెనల ఆధారంగా డబ్బులు వసూలు చేస్తారు. ప్రస్తుతం ప్రతి టోల్‌ప్లాజా వద్ద వాహనదారులు రూ.90 చెల్తిస్తున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ 1 నుంచి ధరలు పెరుగుతాయి.
పిప్పర్వాడ టోల్‌ప్లాజా ఎత్తివేసే చాన్స్
జాతీయ రహదారులపై ప్రతి 60 కిలోమీటర్లకు ఒక టోల్‌ప్లాజా ఉండాలని కేంద్ర రవా ణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ప్రయోజనం ఉండదని అర్థమవుతున్నది. సోన్ మండలం గంజాల్ టోల్‌ప్లాజా నుంచి నేరడిగొండ మండలం రోల్మామడ వరకు దాదాపు 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి జైనథ్ మండలం పిప్పర్వాడ టోల్‌ప్లాజాకు 65 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలు పిప్పర్వాడ టోల్‌ప్లాజా మీదుగా తెలంగాణలో ప్రవేశిస్తాయి. మహారాష్ట్రలోని పాండ్రకవడ వద్ద టోల్‌ప్లాజా ఉంది. ఇది పిప్పర్వాడ టోల్‌ప్లాజాకు 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ క్రమంలో పిప్పర్వాడ టోల్‌ప్లాజాను ఎన్హెచ్ఏఐ ఎత్తివేసే అవకాశాలున్నాయి. టోల్గేట్ ఎత్తివేసినా వాహనాదారులు ఇందుకు సంబంధించిన డబ్బులు మరో టోల్‌ప్లాజా వద్ద చెల్లించాల్సి ఉంటుందని ఎన్హెచ్ఏఐ అధికారులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని మూ డు టోల్‌ప్లాజాల మధ్య దూరాన్ని ఉన్నతాధికారులకు పంపించామని, టోల్గేట్ల ఎత్తివేత విషయంలో తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు.