గెస్ట్ ఫ్యాకల్టీకి వేతనాలు పెంచుతూ సర్కారు నిర్ణయం
ఉమ్మడి జిల్లాలో 250 మందికి ప్రయోజనం
నిర్మల్ టౌన్, మార్చి 23: కేజీ టు పీజీ విద్యలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన మహాత్మా జ్యోతీరావు పూలే గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూనే అందులో పనిచేసే ఉద్యోగులకు అండగా ఉంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మ జ్యోతీరావు పూలే గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు వేతనాలు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలకు అదనంగా 80 శాతం పెంచింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలు ఉండగా మొత్తం 22 గురుకులాలు ఉన్నాయి. ఇందులో 8 కళాశాలలు నిర్వహిస్తుండగా మిగతా 14 స్కూళ్లలో ఇంగ్లిష్ మాధ్యమాల్లో బోధిస్తున్నారు. 2017 -19 లో రెండు విడుతలుగా గురుకులాలను ఏర్పాటు చేసింది.
నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ప్రతి సబ్జెక్టును బోధించేందుకు రెగ్యులర్ ఉపాధ్యాయులు లేనిచోట గెస్ట్ టీచర్లను ఏర్పాటు చేసింది. ఒక్కో పాఠశాలలో 20 మంది వరకు పనిచేయాల్సి ఉండగా ఆరు నుంచి ఏడుగురు రెగ్యులర్ ఉపాధ్యాయులు ఉన్నారు. మిగతా వారంతా గెస్ట్ టీచర్‌గా విద్యాబోధన చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో విద్యాబోధనతో పాటు పీఈటీ, జూనియర్ లెక్చరర్ తదితర పోస్టుల్లో గెస్ట్ ఉపాధ్యాయులు, పీఈటీలు లెక్చరర్లు 250 పైగా పనిచేస్తున్నారు. వీరందరికి ప్రభుత్వం వేతనాలను పెంచింది. కాలేజీలో బోధించే వారికి రూ 18 వేల నుంచి రూ. 27 వేలకు, ఉన్నత పాఠశాలల్లో బోధించే వారికి రూ.14 వేల నుంచి రూ. 24 వేల వరకు పీఈటీలకు రూ.12 నుంచి 20 వేల వరకు వేతనాలు పెంచుతూ బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బుర్ర వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. దీతో బోధన సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి తమ సేవలను గుర్తించి వేతనాలను పెంచడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మొదటి సంవత్సరంలోనే లక్కీ చాన్స్
నిర్మల్‌లోని మహాత్మా జ్యోతీరావు పూలే గురుకుల పాఠశాలలో ఈ విద్యాసంవత్సరమే గెస్ట్ టీచర్‌గా చేరాను. మొదటి సంవత్సరంలోనే నాకు రూ. 14 వేల నుంచి రూ. 24 వేల వేతనం వరకు పెంచడం చాలా సంతోషంగా ఉంది. జ్యోతీరావు పూలే పాఠశాలలో నాణ్యమైన విద్యను బోధిస్తున్న తమ సేవలను గుర్తించి సీఎం వేతనాలు పెంచడం మాపై మరింత బాధ్యతను పెంచింది. మెరుగైన విద్యనందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తాం.
–డీ గంగామణి, బాలికల గురుకుల పాఠశాల
గురుకులాలపై నమ్మకముంది
సీఎం కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేయడమే ఒక చరిత్ర. గురుకులాల్లో ఎంతో మంది పేద విద్యార్థు లు కార్పొరేట్ స్థాయి విద్యనందుకుంటున్నారు. నాణ్యమైన విద్య, భోజనం, సామాజిక అవగాహన, పోటీ పరీక్షలకు గురుకులాల వి ద్యార్థులను అన్ని విధాలుగా తీర్చిదిద్దుతు న్నాం. గురుకులాలపై ప్రజలకు నమ్మకం ఏర్పడింది. మాకు రూ. 18 వేల వేతనాన్ని రూ. 27 వేలకు పెంచడం సంతోషంగా ఉంది.
–హరీశ్, జూనియర్ లెక్చరర్, బాలుర కళాశాల, నిర్మల్