ఆదిలాబాద్ డీఎఫ్‌వో రాజశేఖర్
ప్రపంచ అటవీ దినోత్సవం
ఎదులాపురం, మార్చి 21: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఎఫ్‌వో రాజశేఖర్ అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక అటవీ శాఖ కార్యాలయం వద్ద ద్విచక్రవాహన ర్యాలీని డీఎఫ్‌వో ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరిస్తూ ప్లకార్డులతో అధికారులు, సిబ్బంది ప్రధాన వీధుల గుండా ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో మాట్లాడారు. పర్యావరణ సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పాఠశాలల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్వో బీ గులాబ్‌సింగ్, మావల సర్పంచ్ ప్రవీల,ఎఫ్‌బీవో ప్రశాంత్, సిబ్బంది ఉన్నారు.