నిరుద్యోగుల హర్షం..
సీఎంకు కృతజ్ఞతలు..
పటాకులు కాల్చి సంబురాలు
మంచిర్యాల/కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 9 , నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌పై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపడంతో యువతలో ఆనందం నెలకొన్నది. గరిష్ట వయోపరిమితి 10 సంవత్సరాలు పొడిగించడం, స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు లభించేలా కృషిచేసిన సీఎం కేసీఆర్‌కు నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. అప్పుల తెలంగాణ నుంచి బంగారు తెలంగాణ వైపు కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర అడుగులు వేస్తున్నది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.2.56 వేల కోట్లు ప్రవేశపెట్టడంపైనా సబ్బండవర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. మంచిర్యాల జిల్లాలో 1,025 పోస్టులు భర్తీ కానుండడంతో జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్వై, టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరుద్యోగులు, యువకులు, వారి తల్లిదండ్రులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంచిర్యాల, బెల్లంపల్లిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల పవీణ్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. కు మ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరావు, ఎంపీపీ మల్లికార్జున్‌రావు, జైనూర్‌లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్‌రావు, తిర్యాణిలో డీసీసీబీ డైరెక్టర్ చుంచు శ్రీనివాస్, జిల్లాలోని అన్ని మండలాల్లో టీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశాయి.