కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం
సింగరేణితో కార్మిక సంఘాల చర్చలు సఫలం
పాల్గొన్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ మధు,టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్, అధికారులు
గోదావరిఖని, మార్చి 9: అడ్రియాల గని ప్రమాదంలో మృతి చెందిన వీటీసీ ట్రైనీ కాంట్రాక్టు కార్మికుడు తోట శ్రీకాంత్ కుటుంబానికి రూ.30లక్షల పరిహారం ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఓసీపీల్లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిని ఇవ్వడానికి సింగరేణి యాజమాన్యం అంగీకరించింది. బుధవారం ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కార్మిక సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులతో సింగరేణి యాజమాన్యం జరిపిన చర్చలు ఫలించాయి. సింగరేణి ఏరియా దవాఖానలో మృతదేహాన్ని కదలనివ్వకుండా కుటుంబసభ్యులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు ధర్నాకు దిగిన క్రమంలో యాజమాన్యం కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఇందులో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, టీబీజీకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీ వెంకట్రావ్, మిర్యాల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కాంగ్రెస్ రామగుండం ఇన్చార్జి రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్, ఏఐటీయూసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, వై.వి రావు, ఐఎన్టీయూసీ నాయకులు జనక్‌ప్రసాద్, నర్సింహారెడ్డి, హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ ఆహ్మద్, తోట వేణు, సీఐటీయూ నాయకులు రాజిరెడ్డి, బీఎంఎస్ నాయకులు సారంగపాణి, సింగరేణి యాజమాన్యం తరపున ఆనందరావు, మనోహర్‌రావు పాల్గొన్నారు. ఎట్టకేలకు కుదిరిన ఒప్పందంతో శ్రీకాంత్ కుటుంబసభ్యులు శాంతించారు.
నిర్లక్ష్య వైఖరిని వీడాలి
సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కారణంగానే వీటీసీ ట్రైనీ కార్మికుడు తోట శ్రీకాంత్ మృతి చెందాడు. ట్రైనింగ్‌లో ఉన్న కార్మికుడితో పనులు చేయించడం కరెక్ట్ కాదు. బొగ్గు గనిలో ఉండే పని విధానం ఇతర అంశాలను తెలియజేయాల్సి ఉంటుందే తప్ప అతనికి పనితో సంబంధం లేదు. యాజమాన్యం విధానం వల్లే ఈ ప్రమాదం జరిగింది. శ్రీకాంత్ కుటుంబానికి ఎక్కువ మొత్తంలో పరిహారం ఇప్పించేందుకు ప్రయత్నించాం. చివరకు రూ.30లక్షల పరిహారం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. కేవలం ఉత్పత్తే కాదు రక్షణ చర్యలపైనా సింగరేణి యాజమాన్యం దృష్టిపెట్టాలి.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి